
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్
ఒంగోలు టౌన్: అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, వారి సమస్యలను పరిష్కరించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో శనివారం అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి అగ్రిగోల్డ్ బాధితులు కూటమికి ఓటు వేసి గెలిపించారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారిందన్నారు. ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ఆర్డర్ సంస్థ ద్వారా విలువలు లెక్కించాలని కోరారు. భూముల వేలం ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. బాధితుల సమస్యలపై స్పందించకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ నాయుడు, ప్రధాన కార్యదర్శి వీ తిరుపతిరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు వీ హనుమా రెడ్డి, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ బాధిత నాయకులు ఆరెళ్లమ్మ, మాణిక్యారావు, శేషు కుమార్ రెడ్డి, రాంబాబు, నాగలక్ష్మి, జగన్, మంత్రి నాయక్, సుబ్బారావు, రామదాసు, శంకరయ్య, బెల్లంకొండ శ్రీనివాస్, మునిశంకర్, ఖాదర్ బాష, మల్లిఖార్జున, భద్రం, కుమార్, బడిత అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.