
పౌరుషం, త్యాగానికి ప్రతీక ప్రకాశం పంతులు
నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ ఘనంగా ఆంధ్ర కేసరి 154వ జయంతి వేడుకలు
ఒంగోలు సబర్బన్: పౌరుషం, త్యాగం, ప్రతిభకు ప్రతీకగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆంధ్ర కేసరి 154వ జయంతిని పురస్కరించుకుని శనివారం దేవరంపాడులోని ఉప్పు సత్యాగ్రహ విజయ స్థూపం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం పంతులు, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధునిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు తనదైన ముద్ర వేశారని అన్నారు. సవాళ్లకు ఎదురొడ్డి ధైర్యంగా ముందుకు సాగిన ప్రకాశం పంతులును నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని, తాము ఎంచుకున్న రంగంలో విజేతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ స్మారకం వద్ద రెండు ఎకరాల విస్తీర్ణంలో డ్వామా ఆధ్వర్యంలో పల్లెవనం ఏర్పాటు చేయిస్తామని ఆయన ప్రకటించారు. స్థూపం చుట్టూ పెండింగ్‌లో ఉన్న ప్రహరీ నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేయిస్తామని తెలిపారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. కార్యక్రమంలో డీపీఓ వెంకట నాయుడు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఒంగోలు రూరల్ తహశీల్దార్ షేక్ నాయబ్ రసూల్, రూరల్ డిప్యూటీ తహశీల్దార్ కొల్లిబోయిన అశోక్ కుమార్, రూరల్ ఆర్‌ఐ శ్రీకంఠ శ్రీనివాస రావుతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.