గుట్టుగా మాయం
తెల్ల బంగారం..
అత్యంత విలువైన తెల్లక్వార్జ్ ఖనిజాన్ని అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ రూ.కోట్లు గడించేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు కొండల్ని పిండి చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతుండటంతో తెల్లరాయి గనులు కరిగిపోతున్నాయి. వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో అధికార పార్టీ నేతల అండదండలతో రాత్రికి రాత్రే చైన్నె తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
కురిచేడు:
అక్రమార్కులకు వైట్‌క్వార్జ్ కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలోని దర్శి, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాల్లో తెల్లరాయి గనులు ఉన్నాయి. కురిచేడు, పీసీ పల్లి, పామర్రు, హనుమంతునిపాడు, సీఎస్ పురం, కొమరోలు తదితర ప్రాంతాల్లో తెల్లరాయి ఖనిజం అధికంగా లభిస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికారికంగా, అనధికారికంగా సుమారు రెండు వందల క్వారీలున్నాయి. వీటి ద్వారా కోట్ల విలువైన ఖనిజం అడ్డదారుల్లో విదేశాలకు తరలిపోతోంది. జిల్లాలో నాలుగు రోజుల కిందట పీసీ పల్లి మండలం మురుగమ్మి సమీపంలోని పచ్చటి కొండ ప్రాంతంలో విరివిగా లభ్యమవుతున్న వైట్ క్వార్ట్జ్ ముడి ఖనిజాన్ని టీడీపీ నాయకుడు అడ్డగోలుగా తవ్విస్తున్నాడన్న ఆరోపణలు రావడంతో హడావిడిగా మైనింగ్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న రాయిని సీజ్ చేసి మమ అనిపించారు. ఇక, కురిచేడు మండలం బోధనంపాడు గ్రామం పక్కనే 227 సర్వే నంబరులో 943 ఎకరాల విస్తీర్ణంలో కొండ ఉంది. కొండ చుట్టూ కొంత పోరంబోకు స్థలం కూడా ఉంది. గ్రామ సర్వే నంబరు 227లో 22.494 హెక్టార్లకు అమరం కమోడిటీ వెంచర్స్ కంపెనీ అనుమతి పొందింది. కానీ, దానిలో కేవలం 5 హెక్టార్ల విస్తీర్ణం కొండ ప్రాంతంలో 150 మీటర్ల లోతు వరకు మాత్రమే మైనింగ్ ఏరియా చేయాలనే నిబంధన ఉంది. అధికారులు అనుమతిచ్చింది కొంతవరకే కాగా, సర్వే నంబరు మొత్తం అనుమతి ఉందంటూ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైట్ క్వార్జ్‌ను ఇళ్ల నిర్మాణాల్లో, గాజు తయారీ పరిశ్రమలు, మెటల్ కాస్టింగ్, రబ్బర్, పెయింట్, సెరామిక్, పెట్రోలియం తదితర పరిశ్రమల్లో అవసరాలకు అధికంగా వినియోగిస్తారు.
ప్రభుత్వాదాయానికి భారీగా గండి...
అధికారులు అక్రమార్కులతో చేతులు కలపడంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతా సక్రమ మార్గంలో వెళితే ప్రభుత్వానికి రూ.లక్షల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎగుమతి సుంకం కూడా చెల్లించాలి. అలాగే తవ్వకాలు జరుగుతున్న పంచాయతీలకు సైతం టన్నుల ప్రకారం రుసుం చెల్లించాలి. అయితే వీటన్నింటికి తూచ్ అంటూ అంతా రాత్రివేళ అక్రమార్కులు చైన్నె తరలించేస్తున్నారు. దారిలో అధికారులెవరైనా తనిఖీలు చేస్తే వారికి ఎంతో కొంత ముట్టజెప్పి సరిహద్దులు దాటించేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కురిచేడు మండలంలో కొన్ని శాఖల అధికారులకు నెలనెలా వాటా చేరుతుందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యహరిస్తుండడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు వైట్‌క్వార్జ్ అక్రమ వ్యాపారులపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
కొండల్ని పిండిచేస్తున్న అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు చైన్నె మీదుగా విదేశాలకు ప్రభుత్వాదాయానికి భారీగా గండి మామూళ్లు మత్తులో జోగుతున్న అధికారులు
విదేశాల్లో మంచి గిరాకీ...
నాణ్యతను బట్టి తెల్ల ఖనిజానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఒక లారీకి సుమారు 40 నుంచి 50 టన్నులు లోడ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా నెల్లూరు మీదుగా చైన్నె, అక్కడి నుంచి విదేశాలకు యథేచ్ఛగా తరలించేస్తున్నారు. ఒక లారీ వైట్ క్వార్జ్ విలువ సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకూ ఉంటుంది. మండలంలో ఒక్క బోధనంపాడు కాకుండా పెద్దవరం, పడమర వీరాయపాలెం, ఎన్‌ఎస్‌పీ అగ్రహారం రెవెన్యూ గ్రామాల పరిధిలో తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇదంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వేల టన్నుల వైట్ క్వార్జ్ అక్రమ మార్గంలో తరలిపోతోంది. ఈ వైట్‌క్వార్జ్ లారీలు మద్రాసు వెళ్తాయి. అక్కడి నుంచి షిప్పుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతోంది.
గుట్టుగా మాయం
గుట్టుగా మాయం


