ప్లాస్టిక్‌ను అరికడదాం..పర్యావరణాన్ని కాపాడదాం
మద్దిపాడు: ప్లాస్టిక్‌ను అరికట్టి పర్యావరణాన్ని కాపాడుకుందామని కలెక్టర్ తమీమ్ అన్సారియా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ఉన్న వినాయస్వామి ఆలయం వద్ద ఏపీఐఐసీలోని పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రోత్ సెంటర్‌ను అత్యున్నతంగా తీర్చిదిద్దుకుని ఆదర్శంగా నిలపాలన్నారు. ఇక్కడ అనేక ఫ్యాక్టరీలున్నాయని వాటి ద్వారా వచ్చే పొల్యూషన్ తగ్గించడానికి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధించిందని, అందువలన ఎవరూ ఆ ప్లాస్టిక్ వాడరాదన్నారు. సదరు ప్లాస్టిక్ నీటిలో కరుగుతుందని, భూమిలో మాత్రం కరిగిపోయే పరిస్థితి లేదన్నారు. అటువంటి ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం వలన రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల వెంట ప్లాస్టిక్ విపరీతంగా ఉందని, అందువలన రహదారుల కాంట్రాక్టర్‌కు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసి ప్లాస్టిక్‌ను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవసరమైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా వారిని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా తాము వెనకాడమని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వనం–మనం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో 4 లక్షల 10 వేల మొక్కలు నాటామని, ఇది మంచి పరిణామమని అన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణ హితంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందన్నారు.
నర్సరీలలో 35 లక్షల మొక్కల పెంపకం...
కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో భాగంగా 35 లక్షల మొక్కలను నర్సరీలలో పెంచుతున్నామని తెలిపారు. వాటిలో నీడనిచ్చే చెట్లు, పండ్ల మొక్కలు కూడా ఉన్నాయన్నారు. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ల వారు ఎవరైనా అడిగితే వారికి ఉచితంగానే మొక్కలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. రోడ్ల వెంట కూడా మొక్కలు నాటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీఆర్‌డీఏ ద్వారా మొక్కల సంరక్షణకు నిధులు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. అనంతరం దేవాలయ ఆవరణలో కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ జోసఫ్‌కుమార్, ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీప్రసన్న, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, ఎంఆర్‌ఓ నారాయణరెడ్డి, ఎంపీడీఓ డీఎస్‌వీ ప్రసాద్, గ్రోత్ సెంటర్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మండవ రత్నాకర్, దేవస్థానం కమిటీ సభ్యులు కొండా సర్వేశ్వరరావు, పెనుబోతు అజిత్, బోయిళ్ల శ్రీనివాసరావు, ఫ్యాక్టరీల యజమానులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య పిలుపు ఘనంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం


