జాళ్లపాలెం బాధిత మహిళలకు సజ్జల పరామర్శ
కొండపి: ీససీ ఫుటేజీ కోసం ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్సై రమేష్‌బాబు దుకాణంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో బాధిత మహిళలు చంద్రమ్మ, ఆదిలక్ష్మిలను వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన వివరాలను బాధిత మహిళలు సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు. సీసీ ఫుటేజీ కోసం లోపలికి వెళుతున్న ఎస్సైను మా అన్న వచ్చిన తరువాత రావాలని చెప్పామని, కానీ ఎస్సై మాత్రం ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని నెట్టివేశారని తెలిపారు. ఆ విషయంలో విధులకు ఆటంకం కలిగించామని మా పైనే కేసులు పెట్టారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ మీకు అండగా ఉంటుందని, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన విషయమై కోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపి పరామర్శించారు. బాధితులను పరామర్శించిన వారిలో మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్ ఉన్నారు.


