చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ సమీపంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌తోపాటు ఓ ప్రయాణికురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి శివాంజలి ప్రైవేట్ ట్రావెల్ బస్సు 34 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ సమీపంలోకి వచ్చే సరికి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఓ ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్ కొండల్‌రావు(42) క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన దండిబోయిన గోవిందమ్మ(47)కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలు గోవిందమ్మకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారిద్దరితో కలిసి హైదరాబాద్‌లో బంధువుల ఇంటి వద్ద ఫంక్షన్ ఉండడంతో కుందుకూరు నుంచి బస్సులో వెళ్తోంది.
డ్రైవర్ నిద్రమత్తే కారణం
ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉండగా అందులో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన పోకూరు భుజంగరావు, చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన పులి సన్ని, సుజాత నగర్‌కు చెందిన యనమల మమత, కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన నాయుడు వెంకయ్య, నాయుడు రజని ఉన్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుల్లో కొందరిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి, మరికొంత మందిని హైదరాబాద్‌లోని ఉస్మానియా, హయత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కొండల్‌రావు, ప్రయాణికురాలు గోవిందమ్మ మృతదేహాలకు చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. మృతురాలు గోవిందమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
బస్సు డ్రైవర్, మహిళా ప్రయాణికురాలు మృతి
మరో 18 మందికి తీవ్ర గాయాలు
చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


