పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి
● జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఎంపీడీఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు, డీఎల్డీవోలు, డీఎల్పీఓలు, ఈఓఆర్డీలు, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఎస్‌డబ్ల్యూఎస్, ఉపాధి హామీ పథకం పనుల పురోగతి, హౌసింగ్ పురోగతి, ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమంపై, యోగాంధ్ర క్యాంపెయిన్ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకనుగుణంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 శాతం పచ్చదనం ఉండగా, ప్రకాశం జిల్లాలో 36 శాతం ఉందన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి నవంబర్ వరకు జిల్లాలో 35 లక్షల 75 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారన్నారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 4 లక్షల 10 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
వీడియో సమావేశంలో డీఎఫ్‌ఓ సోషల్ ఫారెస్ట్ రాజశేఖర్, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాల శంకరరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.


