యథేచ్ఛగా అక్రమ కట్టడం
సాక్షి టాస్క్‌ఫోర్స్: గిద్దలూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ముందు భాగంలో వైద్యశాలలో పనిచేస్తున్న ఔట్‌స్సోర్సింగ్ ఉద్యోగి అక్రమ నిర్మాణం చేపట్టాడు. స్థానిక టీడీపీ నాయకుల అండదండలతో వైద్యశాల ముందుభాగంలో క్యాంటీన్ నిర్మాణం చేపట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నాడు. దీనిపై ఒంగోలుకు చెందిన దేశబోయిన వెంకటరాజు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే కాకుండా అక్రమ కట్టడాన్ని తొలగించాలంటూ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ వైద్యశాల ఆవరణలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని తొలగించాలంటూ ఉద్యోగి పందరబోయిన శ్రీనివాసులుకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న శ్రీనివాసులు.. అధికార పార్టీ నాయకులను ఆశ్రయించాడు. దాంతో అక్రమ కట్టడం తొలగింపు చర్యలు నిలిచిపోయాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చాలు.. ప్రభుత్వ నిబంధనలకు అధికారులు పాతరవేస్తున్నారనే విషయం తేటతెల్లమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత నీచంగా ఉందో అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్రమ కట్టడంపై ఓ వ్యక్తి నేరుగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అక్రమంగా నిర్మిస్తున్న కట్టడంపై చర్యలు ఉంటాయో.. లేదో.. వేచి చూడాలి మరి.


