కార్డుదారులందరికీ రేషన్ అందాలి
● రేషన్ షాపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఒంగోలు సబర్బన్:
కార్డుదారులందరికీ సకాలంలో రేషన్ అందాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పౌర సరఫరాల శాఖ అధికారులు, రేషన్ దుకాణాల డీలర్లను ఆదేశించారు. ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీని చేపడుతున్న విషయం తెలిసిందేనన్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలో రేషన్ షాపుల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నెలాఖరు నాటికి ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎంతమంది కార్డుదారులు ఉన్నారు, ఎంత రేషన్ సరఫరా చేశారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు తహసీల్దార్ మధుసూదనరావు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.


