జీజీహెచ్‌లో క్యాన్సర్ నిర్ధారణ పరికరం
ఒంగోలు టౌన్: పీజీ నిధులతో జీజీహెచ్‌కు మరో సరికొత్త వైద్య పరికరం సమకూరింది. క్యాన్సర్ నిర్ధారణ, నివారణకు ఉపయోగపడే ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ(ఐహెచ్‌సీ) పరికరాన్ని సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్, జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజీ నిధులు రూ.40 లక్షలతో ఐహెచ్‌సీ పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ పరికరం క్యాన్సర్ ఏ రకానికి చెందినదో కచ్చితంగా నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. వ్యాధి నివారణకు ఏ రకమైన మందులను ఎంత డోస్ వాడాలి, ఎంత కాలం వాడాలన్నది ఐహెచ్‌సీ సాయంతో తెలుసుకోవచ్చన్నారు. రోగులకు ఓవర్ డోస్ సమస్య ఉత్పన్నం కాదన్నారు. మహా నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఐహెచ్‌సీని జిల్లా ప్రజలతోపాటుగా వైద్య రంగంలోని వారు కూడా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు దుర్గాదేవి, సుధాకర్, సుధాకర్ బాబు, కమ్యూనిటీ మెడిసిన్ శ్రీదేవి, మైక్రోబయాలజీ పద్మప్రియ, సర్జికల్ ఆంకాలజిస్ట్ కిషన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


