26 నుంచి వ్యాక్సిన్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

26 నుంచి వ్యాక్సిన్‌ డ్రైవ్‌

May 21 2025 1:41 AM | Updated on May 21 2025 1:43 AM

26 నుంచి వ్యాక్సిన్‌ డ్రైవ్‌

26 నుంచి వ్యాక్సిన్‌ డ్రైవ్‌

ఒంగోలు టౌన్‌: మీజిల్స్‌, రుబెల్లా వ్యాక్సిన్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని మే 26న ప్రారంభించి, జూలై 26వ తేదీ వరకు వ్యాక్సిన్లు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాక్సిన్లతో ప్రమాదకర న్యూమోనియా, అతిసార, మెదడుకు సంబంధించిన వ్యాధులు నివారించవచ్చని తెలిపారు. 9 నుంచి 12 నెలల మధ్య మొదటి డోసు, 16 నుంచి 24 నెలల మధ్య రెండో డోసు వేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ నిర్దేశిత సమయంలో టీకాలు వేయించని 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రత్యేక కార్యక్రమంలో తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించాలని కోరారు. మే 26 నుంచి 31 వరకు మొదటి రౌండ్‌, జూన్‌ 23 నుంచి 28 వరకు రెండవ రౌండ్‌, జూలై 21 నుంచి 26 వరకు మూడో రౌండ్‌ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో టీకాలు వేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేటి నుంచి గ్రేడ్‌–2

ప్రధానోపాధ్యాయుల బదిలీలు

ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ యాజమాన్యాల్లో పనిచేస్తున్న గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈఓ కిరణ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు, అభ్యర్థన బదిలీ కోరుకునే వారు ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రిఫరెన్షియల్‌ కేటగిరిలో బదిలీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెడికల్‌ బోర్డు చెకప్‌కు హాజరు కాకుంటే..వెంటనే మెడికల్‌ సర్టిఫికెట్‌ పొందాలని సూచించారు.

లేబర్‌ కోడ్‌లు రద్దు చేసే వరకు పోరాటం

ఒంగోలు టౌన్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు మాట్లాడుతూ కార్మిక, కర్షక వ్యతిరేక మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా నాలుగేళ్లుగా పోరాటలు చేస్తున్నా మోడీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా సర్క్యులర్‌ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి పోరాటాల ద్వారా కేంద్రం కుట్రలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు. దేశంలోని కార్మికులు కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో దయనీయ స్థితిలో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయకుండా హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా కేంద్రం దిగివచ్చి లేబర్‌ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు నాయకులు వీరా రెడ్డి, పి.కల్పన, చీకటి శ్రీనివాసరావు, హనుమంతు, రాజశేఖర్‌, దాసరి సుందరం, తంబి శ్రీనివాసరావు, జార్జి, సారధి పాల్గొన్నారు.

తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి

ఒంగోలు సిటీ: మాతృభాషలో విద్యా బోధన చేయడంతోనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ జిల్లా కార్యదర్శి గవిని శివశంకర్‌ మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల పునర్వవస్థీకరణలో భాగంగా 1 నుంచి 8 తరగతులు బోధించే ప్రాథమికోన్నత స్థాయిలో తెలుగు ఉపాధ్యాయులను తొలగించడం, తెలుగు మాధ్యమం లేదని ఉత్తర్వులు ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి తగదని ఆక్షేపించారు. కూటమి పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మాధ్యమాన్ని విస్మరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. విద్యార్థులు మాతృభాషలో చదువుకుంటే సులభంగా నేర్చుకొని భావ వ్యక్తీకరణ చేయగలుగుతారని, తెలుగు మాధ్యమం కొనసాగించి పిల్లలు వారికి ఇష్టమైన మాధ్యమాన్ని ఎంచుకునే విధంగా అవకాశం ప్రభుత్వం కల్పించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement