రెవెన్యూ క్లినిక్‌కు పోటెత్తిన అర్జీలు
ఒంగోలు సబర్బన్:
పొదిలి ఎస్సై వేమనపై చర్యలు తీసుకోవాలి...
పొదిలి ఎస్సై వేమనపై చర్యలు తీసుకోవాలంటూ పొదిలికి చెందిన యాదాల కోటేశ్వరరావు, యాదాల అవినాష్ కుమార్‌లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24వ తేదీ పొదిలిలో ఎరువుల దుకాణం వద్దకు వచ్చిన ఎస్సై వేమన తమను దుర్భాషలాడుతూ కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి హింసించారన్నారు. తొలుత జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు కలెక్టరేట్ ముందు ఎస్సై వేమనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ రాజాబాబు స్పందించి వెంటనే ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎస్సైపై చర్యలు తీసుకుంటానని ఎస్పీ భరోసా ఇచ్చినట్లు బాధితులకు కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు...
ఒంగోలు నగరంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవటంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని దళిత హక్కుల నేత చప్పిడి రవిబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 146/3లో పసుపులేటి శ్రీనివాసులు అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. నెహ్రూనగర్ ఎక్స్‌టెన్షన్‌లోని 146/3 సర్వే నంబరులో అక్రమ స్థలం కోసం తన ఇంటిని కూలగొట్టాడని ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారుడికి సహకరించిన ఒంగోలు నగర కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ సర్వే అధికారులపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఓవర్‌లోడ్‌తో గ్రానైట్ రవాణాపై
కలెక్టర్‌కు ఫిర్యాదు...
చీమకుర్తి, రామతీర్థం, మర్రిచెట్లపాలెం ఏరియాలతో పాటు మార్టూరు, బల్లికురవ గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ రాళ్లను ఓవర్‌లోడ్‌లో తోలి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని చీమకుర్తికి చెందిన గుండా శ్రీనివాసరావు, మరి కొంతమంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలలుగా గ్రీవెన్స్‌లో, రవాణా శాఖ అధికారులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, కుమార్, జాన్సన్, కళావతి, విజయజ్యోతి, డీపీఓ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
మొదటిరోజే భూ సమస్యలు, రెవెన్యూ అంశాలపై 146 అర్జీలు
ఇతర సమస్యలపై పీజీఆర్‌ఎస్‌కు 253 వినతులు కలిపి మొత్తం 399 అర్జీలు


