తగ్గించిన పెన్షన్ పెంచాలి
● రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్
ఒంగోలు వన్‌టౌన్: పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్యాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను మార్చిలోపు తిరిగి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఏపీ ప్రకాశం జిల్లా శాఖ ఒంగోలు వార్షిక సర్వసభ్య సమావేశాన్ని సోమవారం ఒంగోలులోని ఏపీ ఎన్‌జీఓ హోంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెన్షన్ వేలిడేషన్ చట్టాన్ని నిలుపుదల చేయడానికి అవసరమైతే ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి జి.ప్రభుదాసు మాట్లాడుతూ 12వ పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని కోరారు. అదే విధంగా డీఆర్ అరియర్స్, 11వ పీఆర్‌సీ అరియర్స్ విడతల వారీగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగస్తులు, పెన్షనర్లకు ఈహెచ్‌ఎస్ కార్డులు ఇచ్చేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారని, ఆ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించి హెల్త్ ఇన్సూరెన్సు అమలు చేయాలని అన్నారు. జిల్లా ఖజానా అధికారి ఎ.జగన్నాథరావు మాట్లాడుతూ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోపు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. సమస్యలపై ట్రెజరీ ఆఫీసులకు రాకుండా వాట్సాప్ ద్వారా మేసేజ్ పంపినా పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షుడు ఎ.రమణయ్య మాట్లాడుతూ జూలై 2023 నాటికే 12వ పీఆర్సీ ప్రకటించాల్సి ఉన్నా ఇంకా ప్రకటించలేదని, ఐఆర్ కూడా ఇవ్వలేదని అన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఉద్యమించేందుకు ప్రతి పెన్షనరు ముందుకు రావాలన్నారు. ముందుగా ఖజానా శాఖ జిల్లా అధికారి ఎ.జగన్నాథరావు, జాతీయ జెండా ఎగురవేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు బడె అంకిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి కె.సుబ్బారావు, ఒంగోలు ఎస్‌టీఓ ఎన్‌వీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక...
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఎ.రమణయ్య, కార్యదర్శి జి.రామానుజరావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షునిగా బడె అంకిరెడ్డి, సహాధ్యక్షునిగా ఎం.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కంచర్ల సుబ్బారావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా మన్నం హనుమంతరావు, కోశాధికారిగా జి.రామకోటేశ్వరరావు, కోశాధికారిగా ఎన్.ఎస్.ప్రభాకరరావు, తదితర సభ్యులను ఎన్నుకున్నారు.


