బాధితులకు న్యాయం చేయాలి
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్
ఒంగోలు టౌన్ : ప్రజా ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితి లోగా విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 70 ఫిర్యాదులు రాగా, ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ దామోదర్, పోలీస్ అధికారులు.. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకునే చర్యలపై నివేదిక కూడా ఇవ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం పోలీసు స్టేషన్లు/కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదు దారులతో పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించి చట్ట పరిధిలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సురేష్‌బాబు, మహిళా పీఎస్ డీఎస్పీ రమణకుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, డీటీసీ ఇన్‌స్పెక్టర్ షమీముల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్, సిబ్బంది పాల్గొన్నారు.


