మీ కోసం 13వ తేదీకి మార్పు
ఒంగోలు సబర్బన్: కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 12న జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని 13వ తేదీకి మార్పు చేశారు. ఈ నెల 12న సోమవారం డీఆర్‌సీ సమావేశం జరగనుంది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన డీఆర్‌సి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. 12వ తేదీ డీఆర్‌సీ నేపథ్యంలో మీకోసం కార్యక్రమాన్ని 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె
ఒంగోలు టౌన్: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందగిరి రాజేష్ స్పష్టం చేశారు. సమ్మె చేపట్టి 10 రోజులైనా స్పందించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. విలేజీ క్లినిక్‌లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన డిమాండ్లను నిబంధనల మేరకు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన గురువారం 10వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ...సీహెచ్‌ఓల సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం బాధాకరమన్నారు. ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను రెగ్యులర్ చేయాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, హైక్‌ను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ ఇన్సెంటివ్‌లను విడుదల చేయాలని, ఈపీఎఫ్టీ బెనిఫిట్‌ను పునరుద్ధరించాలని, ఎక్స్‌గ్రేషియో పాలసీని అమలు చేయాలని, నిర్ధిష్టమైన జాబ్‌చార్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షా శిబిరంలో ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని 538 మంది సీహెచ్‌ఓలతో పాటుగా రాష్ట్ర , జిల్లా నాయకులు శ్రీకాంత్, ప్రసన్న, జీవనజ్యోతి, జయశ్రీ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పొగాకు వేలాన్ని పరిశీలించిన ఈడీ విశ్వశ్రీ
కనిగిరిరూరల్: కనిగిరి పొగాకు వేలం కేంద్రాన్ని బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ విశ్వశ్రీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వేలం జరుగుతున్న ప్రక్రియను, పొగాకు ధరలు, బేళ్ల నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పొగాకు రైతులతో మాట్లాడారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో అమ్మకానికి తగిన పొగాకును తీసుకుని రావాలని రైతులను కోరారు. కంపెనీల ప్రతినిధులు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అనంతరం బోర్డు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత మార్కెట్ ధరలపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి డి.వేణుగోపాల్, బి. కోటేశ్వరరావు, వేలం నిర్వాహణ అధికారి, రైతు నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మీ కోసం 13వ తేదీకి మార్పు


