యడవల్లిలో ఇరువర్గాల ఘర్షణ
పెద్దదోర్నాల: దీర్ఘకాలంగా గ్రామంలోని ఇరువర్గాల మధ్య ఉన్న వివాదాల నేపథ్యంలో అవి పెరిగి పెరిగి పెద్దవయ్యాయి. రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి పరస్పరం ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలు గురు, శుక్రవారాల్లో జరిగాయి. దాడుల్లో ఓ వర్గానికి చెందిన బత్తుల ఏడుకొండలు, కుంచెపు రాములు, కుంచెపు వెంకట్రాముడులతో పాటు మరో వర్గానికి చెందిన నడిపి పోలయ్య, శంకర్, యల్లమ్మ, సంఘవిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంధువులు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వెంకట రమణయ్యతో పాటు పలు మండలాలకు చెందిన ఎస్సైలు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అందిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని యడవల్లిలో నాలుగేళ్ల క్రితం ఇరువర్గాల నడుమ ఓ వ్యవహారంపై తీవ్రస్థాయిలో గొడవలు తలెత్తాయి. గొడవలకు కారణమైన వారిని గ్రామ పెద్దలు, కుల పెద్దలు తీవ్రంగా మందలించారు. జనవరి ఒకటో తేదీన ఓ వర్గానికి చెందిన బత్తుల ఏడుకొండలును మరో వర్గానికి చెందిన కొందరు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. దీంతో గ్రామంలో మళ్లీ గొడవలు చెలరేగాయి. తమ వర్గానికి చెందిన యువకుడిపై దాడి జరగటంతో ఆగ్రహించిన మరో వర్గానికి చెందిన వ్యక్తులు శుక్రవారం మరో వర్గంపై దాడులకు తెగబడటంతో నడిపి పోలయ్య, శంకర్, యల్లమ్మ, సంఘవిలకు గాయాలయ్యాయి.
పోలీస్ పికెట్ ఏర్పాటు
ఇరువర్గాల నడుమ వివాదాలు చెలరేగి ఘర్షణ చోటు చేసుకోవడంలో మార్కాపురం సీఐ సుబ్బారావుతో పాటు మార్కాపురం, పెద్దారవీడు ఎస్సైలు అంకమరావు, సాంబశివయ్యలు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరోసారి దాడులు చోటు చేసుకోకుండా గ్రామంలో ముందస్తుగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇరు పార్టీల నాయకులు, కుల పెద్దలను పిలిచి భవిష్యత్‌లో మళ్లీ గొడవలు జరుగకుండా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇరువర్గాలకు చెందిన పలువురిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
పరస్పరం దాడి పలువురికి గాయాలు
యడవల్లిలో ఇరువర్గాల ఘర్షణ
యడవల్లిలో ఇరువర్గాల ఘర్షణ


