ఆర్టీసీ విభజన
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి ప్రకాశంలో ఉన్న ఆర్టీసీని కూడా విడదీసి మార్కాపురం జిల్లాలో కలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన మార్కాపురం జిల్లాలో మార్కాపురం డిపోతో పాటు గిద్దలూరు, పొదిలి, కనిగిరి డిపోలను కలిపారు. ఆర్‌ఎంగా ఒంగోలు ఆర్‌ఎం సత్యనారాయణను ఇన్‌చార్జిగా నియమించారు. ఇప్పటి వరకూ ఈ నాలుగు డిపోలు ఒంగోలు రీజియన్ పరిధిలో ఉండేవి. ఒంగోలు ఆర్‌ఎం కార్యాలయం నుంచి పరిపాలన సాగేది. నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో ఆర్టీసీ అధికారులు నూతన జిల్లాకు స్థానిక డిపోలో ఆర్‌ఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మార్కాపురం కేంద్రంగా నాలుగు డిపోలకు సంబంధించి పరిపాలన సాగనుంది. రెగ్యులర్ ఆర్‌ఎంను నియమించేంత వరకూ ఒంగోలు ఆర్‌ఎం మార్కాపురం ఇన్‌చార్జి ఆర్‌ఎంగా వ్యవహరించనున్నారు. మార్కాపురం బస్టాండ్ జిల్లా కేంద్రం బస్టాండుగా మారనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫారాలను పెంచడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం ఒంగోలు బస్సులు నిలిపే ప్రాంతంలో వర్షం పడితే బురదమయంగా మారుతుంది. నూతన ప్లాట్‌ఫారాలను త్వరగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.


