కర్నూల్ ఘాట్‌లో ప్రమాదం
● చెట్టును ఢీకొన్న కారు ● యువకుడి మృతి
పెద్దదోర్నాల: వేగాన్ని అదుపు చేసుకోలేని ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనటంతో యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన కర్నూల్–గుంటూరు జాతీయ రహదారి రోళ్లపెంట గిరిజన గూడెం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భరత్ (23) అనే యువకుడు మృతి చెందాడు. అందిన వివరాల ప్రకారం.. నందికొట్కూర్ నుంచి ఒంగోలుకు నలుగురు యువకులతో బయల్దేరిన కారు రోళ్లపెంట వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని నంద్యాల జిల్లా ఆత్మకూరుకు తరలించినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట రమణయ్య తెలిపారు.
మద్దిపాడు: ఓ యువకుడు మద్యం మత్తులో ఇద్దరిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండలంలోని నాగన్నపాలెంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగన్నపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ప్రేమ్‌కుమార్..అంజయ్య అనే వ్యక్తితో కలిసి మద్యం తాగుతున్నాడు. మాటల సందర్భంలో కాలనీలోని ఒక యువతితో ఎందుకు మాట్లాడుతున్నావని అంజయ్య ప్రశ్నించాడు. మాటమాట పెరిగి అంజయ్య వీపుపై ప్రేమ్‌కుమార్ కత్తితో పొడిచాడు. ఎందుకు పొడుస్తున్నావంటూ అడ్డు వచ్చిన రాతికింది బ్రహ్మయ్యను కూడా పొడవడంతో తొడపై గాయమైంది. కాలనీ వాసులు స్పందించి క్షతగాత్రులను 108లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ప్రేమ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని నాయపాము శృతి ఏషియన్ యోగా పోటీలకు ఎంపికై ంది. యోగాసన భారత్‌లో భాగంగా మహారాష్ట్రలో డిసెంబర్ 29 నుంచి జనవరి 2వ తేదీ వరకు 6వ సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న శృతి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచి ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌కు ఎంపికై ందని జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం గిరిజ తెలిపారు. గ్రామస్తులు, దాతల సహకారంతో శిక్షణ పొందుతున్న శృతి కఠోర దీక్షతో అంచలంచలుగా ఎదిగిందని హెచ్‌ఎంతోపాటు వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రతిమ, ఉపాధ్యాయులు అభినందించారు.
ఉలవపాడు: తాను దక్షిణాఫ్రిక వెళ్లేందుకు డబ్బులు ఇవ్వకుంటే చనిపోతానని గుర్తుతెలియని మందు తాగి బెదిరించబోయి ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చాగల్లులో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వల్లెపు వంశీకృష్ణ (27) దక్షిణాఫ్రికలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది ఆగస్టులో స్వగ్రామం వచ్చి నెల పాటు ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ వెళ్లాలని తండ్రి వల్లెపు శ్రీనివాస్, తాత వెంకట సుబ్బారావును అడిగాడు. అక్కడికి ఇక వద్దని, ఇక్కడే ఉండాలని వంశీకృష్ణకు సర్ది చెప్పారు. తండ్రి, తాతను బెదిరించి అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకుని డిసెంబర్ 21వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఉలవపాడు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అదే నెల 23వ తేదీన ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి చిన్నాన్న కుమారుడు కుంచాల దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూల్ ఘాట్‌లో ప్రమాదం


