చంద్రబాబు కక్ష.. నెల నెలా శిక్ష
ఈ మహిళలది మార్కాపురం మండలం మొద్దులపల్లి గ్రామం. వీరు మోస్తోంది రేషన్ బియ్యం. ప్రతి నెలా ఇదే సీన్. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసేవే అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా రద్దు చేసింది. ఇంటి వద్దే రేషన్ సరుకులు అందించే ఎండీయూ వాహనాలను తొలగించడంతో కార్డుదారులకు నెల నెలా శిక్ష తప్పడం లేదు.
రేషన్ సరుకుల కోసం కాలినడకన 3 కి.మీ ప్రయాణం
మార్కాపురం మండలం మొద్దులపల్లి వాసుల ఆవేదన
మా ఊరిలో రేషన్ షాపు పెట్టాలి
గత ప్రభుత్వంలో మాకు రేషన్ కష్టాలు తెలియవు. మా ఊరిలో రేషన్ షాపు లేకపోయినా గతంలో ఇంటి వద్దకు వచ్చి బియ్యం, చక్కెర ఇచ్చారు. బండ్లు తీసేయడంతో మా గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి యాచవరంలో రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నాం. మా గ్రామంలో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– మరియమ్మ, జయమ్మ, కేశమ్మ
మార్కాపురం మండలం మొద్దులపల్లిలో 280 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక్కడ రేషన్ దుకాణం లేకపోవడంతో కార్డుదారులు 3 కి.మీ దూరంలోని యాచవరం గ్రామానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొందరు వాహనాలపై వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. వాహన సౌకర్యం లేనివారు, మహిళలు నడుచుకుంటూ వెళ్లి రేషన్ బియ్యం, చక్కెర తెచ్చుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు లేవని, తమ గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
– మార్కాపురం రూరల్
(మార్కాపురం)


