డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ కేసులు
ఒంగోలు సిటీ: కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఒంగోలులోని ఆయన నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఎవరు ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారో, దైవ సంబంధ కార్యక్రమాలపై కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. వీటన్నింటి మీద ప్రజలు తీర్పు ఇచ్చిన రోజున రెట్టింపు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాను స్వాగతిస్తున్నామని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడం మంచిదేనన్నారు. అయితే జిల్లా కేంద్రమైన మార్కాపురానికి దగ్గరగా ఉన్న దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలిపితే బాగుండేదని స్థానిక నాయకులు, ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. రానున్న రోజుల్లో దీనిపై పార్టీ నాయకుల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా పరిపాలన సౌలభ్యం కోసం పార్లమెంట్‌ల వారీగా జిల్లాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు పూర్తి చేసిందన్నారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి నీళ్లు అందించాలన్నారు.
వైవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద కోలాహలం
ఒంగోలు లోని రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కొండపి నియోజకవర్గం నుంచి వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వై.వి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ లను గజమాలతో సత్కరించారు. అనంతరం వై.వి.సుబ్బారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొన్నారు.


