పదవుల కాక
కూటమిలో
జిల్లాలో వివిధ కార్పొరేషన్ పదవుల
పంపకం కోసం కూటమి నేతలు
పోటీపడుతున్నారు. ఎన్నికల సమయంలో పదవుల ఆశచూపి పనిచేయించుకుని
తీరా అధికారంలోకి వచ్చాక తమను
పట్టించుకోకుండా మొండిచేయి
చూపుతున్నారంటూ నాయకులు తీవ్ర
అసంతృప్తితో రగిలిపోతున్నారు. కూటమి నేతల మధ్య సఖ్యత లేక పదవుల
పంపకంలో జాప్యం జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య పోటీతో పాటుగా, టీడీపీ, జనసేనలోని గ్రూపు
రాజకీయాలు కూడా పదవులకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.
కూటమిలో సఖ్యత లేకపోవడమే
కారణమా...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన పదవుల పంపకాల్లో టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా నూకసాని బాలాజీ, మారిటైం బోర్డు చైర్మన్‌గా దామచర్ల సత్యలకు పదవులు దక్కాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వీరిద్దరికీ పదవులను ఇవ్వకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయినా లోకేష్ ద్వారా సత్య, చంద్రబాబు ద్వారా బాలాజీ పదవులు తెచ్చుకున్నారు. పదవుల కోసం ప్రయత్నాలు చేసే వారికంటే నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, అతడికి మాత్రం ఇవ్వవద్దు అంటూ పట్టుపడుతున్నవారు ఎక్కువగా ఉంటున్నారని తెలిసింది. ఇది అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు చెప్పుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన కార్పొరేషన్ పదవులను భర్తీ చేయకపోవడంతో నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందు చాలా మంది నాయకులకు పదవుల ఆశ చూపించి అన్నీ రకాలుగా వాడుకున్నారు. తీరా ఎన్నికలు పూర్తయ్యాక పదవులు భర్తీ చేయకుండా తిప్పుకోవడంపై తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు జనసేన నాయకులు కూడా పదవుల్లో వాటా అడుగుతుండడంతో అధిష్టానం ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్ పదవుల విషయంలో తొలుత హడావుడి చేసిన జనసేన నాయకులు ఇప్పుడు ఆశలు వదులుకొని చడీ చప్పుడు లేకుండాపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒడా పదవి కోసం పోటాపోటీ...
ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఒడా) పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీల మధ్య మొదట్నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పదవిని జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌కు ఇప్పిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే సీనియర్ నాయకుడు మంత్రి శ్రీనివాస్ కూడా తనకు ఒడా పదవి కావాలని పట్టుపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయనతో పాటుగా సింగరాజు రాంబాబు సైతం ఒడా పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరిగింది. స్థానిక నాయకులతో సంబంధం లేకుండా ఒడా పదవికి దర్శి మాజీ ఎమ్మెల్యే పాపారావు పేరు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన గొట్టిపాటి లక్ష్మి కూడా ఈ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాయకుల మధ్య పోటీ ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసలు పట్టించుకుంటున్నట్లు కనిపించడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా ఈ పదవిని భర్తీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాంతో ఒడా పదవిని ఆశిస్తున్న నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. మిగతా జిల్లాల్లో పదవులను భర్తీ చేసి కేవలం ఒంగోలు ఒడా పదవిని మాత్రమే ఎందుకు భర్తీ చేయడం లేదని గట్టిగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
పీడీసీసీ బ్యాంకు పదవి సంగతేంటో...
జిల్లాలో కీలకమైన మరో పదవి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీ) చైర్మన్. ఈ పదవిని టీడీపీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో గత ఎన్నికల్లో దామచర్ల విజయం కోసం పనిచేసిన పలువురు నాయకులు ఈ పదవిపై కన్నేసినట్లు చెప్పుకుంటున్నారు. నగరంలో స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడిగా పేరున్న మండవ మురళీకృష్ణ పీడీసీసీ పదవి కోసం ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆయనకు బదులుగా నగరంలోని ప్రముఖ వైద్యశాల నిర్వాహకుడైన డాక్టర్ సీతారామయ్య పేరును అధిష్టానం వద్ద ఎమ్మెల్యే దామచర్ల ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిద్దరే కాకుండా ఇటీవల హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి కూడా పీడీసీసీ రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ ఈ పదవికి వీరయ్య పేరు ఖరారు చేశారని ప్రచారం జరిగింది. అయితే ఈలోపు ఆయన ఊహించని రీతిలో ఆయన హత్యకు గురయ్యారు. తాజాగా ఎమ్మెల్యే దామచర్ల పట్టుబట్టి మరీ సీతారామయ్య పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
యార్డు పదవి ఎప్పుడు భర్తీ చేస్తారో...
మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి కూడా మంచి గిరాకీ ఉంది. పార్టీలో ఈ పదవిని ఆశిస్తున్న నాయకుల లిస్టు చాంతాడంత ఉంది. గత ఎన్నికల సమయంలో మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇస్తానంటూ దామచర్ల హామీ ఇచ్చినట్లు చాలా మంది నాయకులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. తొలుత ఈ పదవి ఎస్సీలకు రిజర్వ్ అయిందని ప్రచారం జరిగింది. నత్తల కనకారావు, శశిభూషణ్‌లతో పాటుగా నగరానికి చెందిన ఒక మహిళా వైద్యురాలు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి ఇప్పుడు బీసీలకు రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో బీసీల్లో యాదవ సామాజిక వర్గానికే చైర్మన్‌గిరి దక్కాలని నాయకులు పట్టుపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి సిరిపురం వెంకటరావు, కొఠారి నాగేశ్వరరావుల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. దామచర్ల ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారికి పదవి దక్కడం ఖాయం.
మిగతా పదవులపై ఆశలు...
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మైనారిటీ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య, డీసీఎంఎస్, జిల్లా పశుగణాభివృద్ధి సంఘం, దేవాలయ కమిటీల పదవుల కోసం ఎవరికివారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఇటు ఎమ్మెల్యేల నుంచి కానీ, అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనివార్య పరిస్థితిలో ఎదురు చూస్తున్నారు. ఇటు మైనారిటీ, ఎస్సీ, బీసీ నాయకులు తమకు తగిన గుర్తింపు లభిస్తుందో లేదోనని పడిగాపులు కాస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య పోటీతో పాటుగా, టీడీపీ, జనసేనలోని గ్రూపు రాజకీయాలు కూడా పదవులకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.
కార్పొరేషన్ పదవుల్లో జిల్లా నేతలకు మొండిచేయి ఒడా, పీడీసీసీ, డీసీఎంఎస్, మార్కెట్ యార్డు, జిల్లా గ్రంథాలయ సంస్థ, మైనారిటీ కార్పొరేషన్ పదవులన్నీ ఖాళీ కూటమి నాయకుల్లో సఖ్యత లేకే పదవులు భర్తీ చేయడం లేదంటూ ప్రచారం పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో తీవ్ర అసంతృప్తి


