
వీరయ్య కేసులో వీడుతున్న చిక్కుముడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు చిక్కుముడి వీడుతున్నట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్న కొప్పోలుకు చెందిన ఇసుక వ్యాపారి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అతడికి పరిచయమున్నట్లు చెబుతున్న యువకుడు మరణించడంతో ఇసుక వ్యాపారి స్వయంగా లొంగిపోయాడా లేక పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా అతడు పట్టుపడితేనే కానీ పూర్తి వివరాలు వెల్లడికావంటూ ఇన్నాళ్లుగా పోలీసులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అతడు దొరికిపోవడంతో దాదాపుగా కేసు ముగిసినట్టేనని తెలుస్తోంది. హత్యకు ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరు, ఎవరి పాత్ర ఏమిటి, హత్యలో పాల్గొన్న హంతకులు ఎంతమంది, వారంతా ఎక్కడివారనే సమాచారాన్ని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ హత్యలో నిందితులంతా దాదాపుగా టీడీపీ నాయకులేనని పోలీసుల నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన సూత్రధారిగా చెబుతున్న అమ్మనబ్రోలు టీడీపీ యువనాయకుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. నెల్లూరుకు చెందిన మరో ఇద్దరు పాత్రధారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలో ప్రధాన పాత్రధారి కూడా దొరికిపోవడంతో గురువారం వీరయ్య పెదకర్మలోపే పోలీసులు కేసును ఫైనల్ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
అందరూ అమ్మనబ్రోలుకు చెందిన
టీడీపీ నాయకులే...
తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి ఏప్రిల్ 22వ తేదీ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడివారంతా వీరయ్య చౌదరి స్వగ్రామమైన అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకులే కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. హత్యకు ప్రధాన సూత్రధారిగా చెబుతున్న వ్యక్తి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రస్తుతం సంతనూతలపాడు టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటుగా మరో ఇద్దరు సూత్రధారులు కూడా అదే గ్రామానికి చెందిన వారిగా ప్రచారం జరుగుతోంది. హత్యకు పథక రచన నుంచి డబ్బు సమకూర్చడం కూడా వీరే చేశారని ప్రచారం జరుగుతోంది. వీరి వెనక పెద్ద తలకాల హస్తమేమన్నా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఈ కేసును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టేందుకు ఎల్లో మీడియా ప్రయత్నం చేసి విఫలమైందని స్థానికులు చెబుతున్నారు. హత్యకు పథకరచన చేసి, డబ్బులు సమకూర్చినవారంతా టీడీపీ నాయకులేనని తేలడంతో వారు చేతులెత్తేశారని చెప్పుకుంటున్నారు.
టీడీపీ నాయకుల్లో కలకలం...
వీరయ్య చౌదరి హత్య కేసు ఫైనల్‌కు చేరడంతో జిల్లాకు చెందిన టీడీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. హత్యలో ప్రధాన సూత్రధారుడిగా చెబుతున్న అమ్మనబ్రోలు టీడీపీ యువనాయకుడితో జిల్లా టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు సత్సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అతడితో రాసుకొని పూసుకొని తిరిగిన దాఖలాలు ఉన్నాయి. దాంతో ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎవరి తలకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వీరయ్య చౌదరి అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ హంతకులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని చెప్పడం, అసలు హంతకులకు ఈ నేల మీద తిరిగే అర్హతలేదనడంతో పోలీసులు ఈ కేసును ఎటు తీసుకెళతారో అర్థంకాక గుబులు చెందుతున్నారు. వీరయ్య చౌదరి హత్యలో నిందితులంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారే ఉండడంతో ఇప్పటికే ఆ పార్టీ పరువు పోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పోలీసుల అదుపులో ప్రధాన పాత్రధారుడు కేసు చివరిదశకు రావడంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన నిందితులంతా టీడీపీవారే కావడంతో ఏం జరుగుతుందోనన్న గుబులు