రాష్ట్రాన్ని దోచుకోవడమే కూటమి నేతల పని
యర్రగొండపాలెం: రాష్ట్రాన్ని దోచుకోవడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. స్థానిక వినుకొండ రోడ్డులో ఉన్న వైష్ణవి గార్డెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, వర్గ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటమి నాయకులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయటానికి, దగా చేయటానికి, అమ్మివేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కనీసం దేవాలయాల నిర్వహణ కూడా సక్రమంగా చేయడానికి చేతగాక భక్తులను బలితీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సింహాచలంలో వరాహ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం వెళ్లిన ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని తెలిసినా కాసుల కోసం ఆశపడి హడావుడిగా ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారని, చిన్నపాటి వర్షం, గాలికే ఆ గోడ కూలి భక్తులు బలయ్యారని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వ కాలంలో విజయవాడలో రిటైనింగ్‌వాల్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడారని, భారీ వర్షం కురిసినా ఆ గోడ చెక్కు చెదరకుండా ఆ ప్రాంత ప్రజలను రక్షించిందన్నారు. తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం ఆ సంఘటన మరువకముందే సింహాచలం సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, భక్తుల ప్రాణాలు తీసింది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో పాటు అడవుల్లో నివశిస్తున్న మూగజీవాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, తిరుపతిలో గోవులు మృత్యువాత పడినా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకుండా పోయిందన్నారు. అడవుల్లో జింకలను వేటాడినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుందని, అదే వాస్తవమైతే అటవీ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ బాధ్యత వహించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే తాటిపర్తి పుట్టినరోజును పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్


