వైఎస్సార్ సీపీలో నియామకాలు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఇద్దరిని పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీ జనరల్ సెక్రటరీగా దర్శికి చెందిన కుమ్మిత అంజిరెడ్డి, సెక్రటరీగా గిద్దలూరుకు చెందిన వేమిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి.
వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
ఒంగోలు: ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే నెలలో బాలురకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జి.ధనుంజయరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మంగమూరు రోడ్డులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లలోపు వయసు, 180 సెంటీమీటర్ల కనీస ఎత్తు కలిగిన బాలురు అర్హులని స్పష్టం చేశారు. మే 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9490382802ను సంప్రదించాలని సూచించారు.
3న బాస్కెట్‌బాల్ సబ్ జూనియర్ జట్ల ఎంపిక
ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లా బాస్కెట్ బాల్ సబ్ జూనియర్ బాలబాలికల క్రీడా జట్ల ఎంపిక ఈనెల 3న కందుకూరులోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి తొట్టెంపూడి సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2012 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఎంపికై న వారు ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు చిత్తూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంపికకు హాజరయ్యే బాలబాలికలు తమ వెంట పుట్టిన తేదీ ధ్రువపత్రం తీసుకురావాలని, వివరాలకు 9866126955ను సంప్రదించాలని సూచించారు.
నీటి కుంటలో పడి
వృద్ధురాలి మృతి
హనుమంతునిపాడు: గేదెలకు నీరు తాపే క్రమంలో ప్రమాదవశాత్తు కుంటలో పడి ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. ఈ సంఘటన బుధవారం మండల కేంద్రమైన హనుమంతునిపాడు–మోరవారిపల్లి గ్రామాల మధ్య ఎర్రవాగులో చోటుచేసుకుంది. స్థానికల కథనం మేరకు.. మోరవారిపల్లి గ్రామానికి చెందిన కొండా సీతయ్య భార్య కొండా పుల్లమ్మ(77) తమ గేదెలను మేత కోసం ఎర్రవాగు వైపు తోలుకెళ్లింది. మధ్యాహ్నం సమయంలో గేదెలకు నీరు తాపేందుకు వాగులోని నీటి కుంట వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటి కుంటలో పడటంతో ఊపిరాడక మృతి చెందింది. రోడ్డు పనుల కోసం మట్టి తోలుతున్న జేసీజీ, టిప్పర్ డ్రైవర్లు నీటి కుంటలో తేలియాడుతున్న చీరను గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చి పరిశీలించి పుల్లమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు.
వృద్ధుడు ఆత్మహత్య
జరుగుమల్లి(సింగరాయకొండ): అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం నందనవనంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గొడుగు మస్తాన్ సాహెబ్(85) గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని కలుపు నివారణకు వినియోగించే పురుగుమందు తాగారు. కుటుంబ సభ్యులు గుర్తించి 108 అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి.మహేంద్ర తెలిపారు.
ఏఎస్సై దంపతులకు
ఎస్పీ సన్మానం
ఒంగోలు టౌన్: పట్టుదల, కృషితో అంచెలంచెలుగా ఎదిగి బేస్తవారపేట ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన పి.నారాయణరెడ్డి సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ మరచిపోదని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో నారాయణ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. 35 ఏళ్ల పాటు పోలీసు శాఖలో సమర్థవంతంగా పనిచేస్తూ, క్రమశిక్షణతో విధులు నిర్వహించారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని, మంచిపేరే చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. శేష జీవితం కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్సై తిరుపతిస్వామి, ఏఎస్సై కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో నియామకాలు


