పొట్ట కూటికి వెళ్లి అనంత లోకాలకు..
కొండపి: తిరుపతి నగరంలోని తిరుమలనగర్ తుడా క్వార్టర్స్‌లో ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన కొండపి మండలంలోని అనకర్లపూడిలో విషాదం నింపింది. మృత్యువాతపడిన ముగ్గురు కార్మికుల్లో ఇద్దరు అనకర్లపూడి వాసులు కావడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తన్నీరు వసంత్(40), కుంచాల శ్రీనివాస్(42) తమ కుటుంబాలతో కలిసి భవన నిర్మాణ పనుల నిమిత్తం తిరుపతికి వలస వెళ్లారు. తిరుపతి జిల్లా మంగళం పరిధిలోని తిరుమలనగర్‌లో తుడా క్వార్టర్స్‌లో హెచ్‌ఐజీ ఫ్లాట్ నంబర్ 63లో నిర్మిస్తున్న భవనంలో పనిచేస్తున్నారు. ఐదో అంతస్తులో నలుగురు మేసీ్త్రలు పూత పని చేస్తున్న క్రమంలో సారవ నుంచి ఓ కర్ర జారిపోవడంతో ఒక్కసారిగా కిందకు పడిపోయారు. ఈ ఘటనలో తన్నీరు వసంత్, కుంచాల శ్రీనివాసులు అక్కడికక్కడే మతి చెందారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. తన్నీరు వసంత్‌కు భార్య నారాయణమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుంచాల శ్రీనివాస్‌కు భార్య నారాయణమ్మ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాలు బుధవారం రాత్రి అనకర్లపూడి చేరుతాయని బంధువులు తెలిపారు.
తిరుపతి తుడా లేఔట్ ప్రమాదంలో ముగ్గురు మృతి
వారిలో ఇద్దరు వ్యక్తులు అనకర్లపూడి వాసులు
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
పొట్ట కూటికి వెళ్లి అనంత లోకాలకు..


