పరిహారం..ప్రశ్నార్థకం.!
కనిగిరిరూరల్: ఎన్‌హెచ్ 565 బైపాస్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.. రోడ్డు పనులు కూడా చివరి దశకు చేరాయి.. భూమి నష్టపోతున్న బాధితులకు నష్టపరిహారం మాత్రం అందలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నష్టపరిహారం అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా కనిగిరి బైపాస్ భూ బాధితుల నష్టపరిహారం ప్రశ్నార్థకంగా మారింది. తొలి విడతలో బడా రైతులకు భూ పరిహారం అందించిన అధికారులు.. చిన్న, సన్నకారు రైతులకు భూ నష్టపరిహారం అందించే విషయంలో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సెంటు నుంచి 5 సెంట్ల వరకు భూములు, ప్లాట్లు కోల్పోయిన బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.
48 మంది సన్నకారు రైతుల
పరిహార జాబితా వెనక్కి..?
ఏ శాఖ అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ 48 మంది చిన్న భూ బాధిత రైతుల పరిహార జాబితా వెనక్కి వచ్చినట్లు తెలిసింది. భూసేకరణ సెక్షన్ అధికారులు అలసత్వంతో గత నెలలో ఫైల్ పంపించడం వల్లే వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ వాలిడ్ ఫైనాన్షియల్ ఇయర్ అనే కారణం చూపుతూ జాతీయ రహదారుల అథారిటీ పరిహారం జాబితాకు తిప్పి పంపింది. అయితే మార్చిలోనే తాము ఫైల్ పెట్టామని, పరిహార జాబితా శాంక్షన్ కాకుండా ఎందుకు వెనక్కి పంపారో తెలియదని కలెక్టరేట్ లోని ల్యాండ్స్ సెక్షన్ అధికారులు బుకాయిస్తున్నారు. రెండు శాఖల మధ్య పొంతన లేని సమాధానాలు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
కనిగిరిలో ఎన్‌హెచ్ 656 రోడ్డు నిర్మాణ సమయంలో భూ బాధితులందరికీ న్యాయం చేస్తామని, అభివృద్ధిని ఎవరూ అడ్డు కోవద్దని, ప్రతి ఒక్కరికీ పరిహారం ఇప్పిస్తామని డివిజన్, జిల్లా స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహించి రోడ్డు పనులు సాఫీగా జరిగేలా చూశారు. కానీ చిన్న చితకా రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో మాత్రం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు. ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షణ చేయకపోవడంతో 48 మంది సంబంధించిన పరిహార జాబితా వెనక్కి వచ్చినట్లు తెలిసింది. జాతీయ రహదారుల సంస్థ( నేషనల్ హైవే అథారిటీ) పరిహారం కోసం బాధితులు రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్‌హెచ్ అధికారులు తిప్పి పంపిన ఫైల్‌తో పాటు ఇంకా క్లెయిమ్స్ పెట్టని భూ బాధితులు మరి కొందరున్నారు. బైపాస్ రోడ్డు బాధితులకు సంబంధించి సుమారు రూ .13 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా 60 శాతం కూడా పరిహారం చెల్లింపులు పూర్తి కాలేదని సమాచారం. తమకు రావాల్సిన పరిహారంపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు దృష్టి సారించి న్యాయం చేయాలని సన్న, చిన్న కారు భూ బాధితులు కోరుతున్నారు.
ఎస్‌హెచ్ 565 భూ బాధితుల్లో హై టెన్షన్
పూర్తి కావస్తున్న రోడ్డు నిర్మాణం..దక్కని పరిహారం
ఫైనాన్షియల్ ఇన్ వాలిడ్ సాకుతో 48 మందికి మొండిచెయ్యి
తహసీల్దార్ ఏమంటున్నారంటే..
దీనిపై స్థానిక తహసీల్దార్ రవి శంకర్‌ను సాక్షి వివరణ కోరగా ఇన్‌వాలిడ్ ఫైనాన్షియల్ ఇయర్ కారణంతో ఫైల్ వెనక్కి వచ్చినా... మళ్లీ ఫైల్‌ను రీ శాంక్షన్‌కు పంపిస్తామన్నారు. దీని వల్ల బాధితులకు ఎటువంటి నష్టం జరగదన్నారు. త్వరలోనే హైవే రోడ్డు బాధితులందరికీ పరిహారం నిధులు పడుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


