తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకోం
ఒంగోలు టౌన్: గుండాయపాలెం ఎంపీటీసీ ఐలా వాణి భర్త ఏడుకొండలపై తప్పుడు ఫిర్యాదులు చేసిన వారు అంతకు రెండింతలు అనుభవిస్తారని, తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తే ఊరుకోమని వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్‌చార్జి చుండూరు రవిబాబు హెచ్చరించారు. గుండాయపాలెం ఎంపీటీసీ ఐలా వాణి భర్త ఏడుకొండలు అక్రమ అరెస్టు, నిర్భందాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు, లీగల్ సెల్ న్యాయవాదులతో కలిసి మంగళవారం మధ్యా హ్నం తాలుకా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి గాయపడిన వారిని అరెస్టు చేయడమేంటని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగంలో తాము పనిచేస్తున్నామని సంగతిని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. అర్ధరాత్రి అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించడమేంటని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని ఎక్కడ ఉంచారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. బాధిత కుటుంబం, న్యాయవాదులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారని, పోలీసుల కస్టడీలో ఉన్న వారితో కలిసి మాట్లాడాల్సి ఉందని చెప్పారు. అసలు ఏడుకొండలపై ఏ కేసు పెట్టారో, ఎందుకు నిర్బంధించారో, ఎక్కడున్నారో అడుగుతుంటే సమాధానం చెప్పకపోతే ఎలా అని నిలదీశారు. సాయంత్రం లోగా పోలీసులను కోర్టులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులపై పెట్టిన కేసుల వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
వారిపై ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఏడుకొండలు కుటుంబం గొడవలకు దూరంగా ఉంటారని, వివాదాలంటే అమడ దూరం పారిపోయే అమాయకులపై కూటమి నాయకులు దాడి చేయడం దారుణమన్నారు. ఈ విషయం గురించి గుండాయపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొందరినీ అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని, ఇదంతా ఒంగోలు రాజకీయమని చెబుతున్నారని తెలిపారు. ఈ కేసుల వెనుక ఉన్న ఒంగోలు వ్యక్తులు ఎవరో చెప్పాలన్నారు. ఎంపీటీసీ ఐలా వాణి మాట్లాడుతూ గ్రామంలోని రామాలయం సెంటర్లో షాపులో ఉన్న మాపై పెదసింగి వెంకటేశ్వర్లు అనే టీడీపీ నాయకుడు వచ్చి దాడి చేసి కొట్టారని చెప్పారు. దాడిలో గాయాలయ్యాయని సీఐకి చెప్పినా పట్టించుకోకపోగా, బాగానే ఉందిగా అన్నాడని తెలిపారు. తన భర్తకు షుగర్ వుందని, నిన్నటి నుంచి మందులు కానీ, ఆహారం ఇవ్వలేదని, ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి రవణమ్మ, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, తాతా సరసింహరావు, మలిశెట్టి దేవ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అంతకు రెండింతలు అనుభవిస్తారు
టీడీపీ జీతాలు ఇవ్వడం లేదన్న సంగతి పోలీసులు గ్రహించాలి
బాధితులకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవిబాబు హెచ్చరిక


