కదిలొచ్చిన దేవదేవుడు
మార్కాపురం టౌన్: స్థానిక లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం అశేషజనవాహిని మధ్య కన్నుల పండువగా జరిగింది. వేలాదిగా భక్తులు స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్నారు. జై చెన్నకేశవా.. జైజై చెన్నకేశవా.. గోవిందా నామస్మరణలతో స్వామి వారిని దర్శించుకుని రథచక్రాలకు టెంకాయలు, గుమ్మడికాయలను కొట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రథం బయలుదేరినప్పటి నుంచి మళ్లీ తిరిగి యథాస్థానం చేరే వరకు భక్తులు పోటీపడి రథాన్ని ముందుకు లాగి తమ భక్తిని చాటుకున్నారు. పట్టణంతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా పాల్గొని స్వామి వారి రథోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి రథయాత్ర ప్రారంభమై మెయిన్ బజార్, పాత బస్టాండ్, నాయుడు వీధి మీదుగా యథా స్థానానికి చేరింది. సాయంత్రం 5 గంటల నుంచే పట్టణానికి వేలాది మంది భక్తుల రాక మొదలైంది. జెండా ఊపి రథోత్సవాన్ని అధికారులు ప్రారంభించారు. ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవం ఏర్పాట్లు జరిగాయి. స్వామివారిని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సబ్‌కలెక్టర్ త్రివినాగ్, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సీనియర్ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఒంగోలు, మార్కాపురం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, కందుల నారాయణరెడ్డి, బీజేపీ, జనసేన ఇన్‌చార్జిలు పీవీ కృష్ణారావు, ఇమ్మడి కాశీనాథ్ తదితరులు దర్శించుకుని పూజలు చేశారు.
భద్రత ఏర్పాట్లు:
పట్టణంలో రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు ఆధ్వర్యంలో సీఐ సుబ్బారావు తోపాటు మరో ఐదుగురు సీఐలు, ఎస్సైలు సైదుబాబు, రాజమోహన్‌రావు, అంకమరావు, అహరోన్‌లతో పాటు 14 మంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుల్స్, స్పెషల్ పార్టీల పోలీసులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు.
కన్నుల పండువగా చెన్నకేశవుని రథోత్సవం తిలకించిన లక్షలాది మంది భక్తులు
కదిలొచ్చిన దేవదేవుడు
కదిలొచ్చిన దేవదేవుడు


