బానిస బంధనాల నుంచి విముక్తి | - | Sakshi
Sakshi News home page

బానిస బంధనాల నుంచి విముక్తి

Mar 20 2025 1:15 AM | Updated on Mar 20 2025 1:16 AM

కలెక్టర్‌ తమీమ్‌అన్సారియా చొరవతో కూలీలకు స్వేచ్ఛ

ఒంగోలు సిటీ: వారంతా రోజువారీ కూలీలు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉపాధి కల్పిస్తామని ఆశ చూపి, యజమాని బానిసత్వంలో బంధించాడు. అయిన వారికి, ఉన్న ఊరికి దూరంగా దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్న వారికి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశాలతో జిల్లా అధికారులు విముక్తి కల్పించారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తూ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబరులో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా రిలీఫ్‌ సర్టిఫికెట్లు అందించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపట్నం మండలంలోని ఆలూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన ఏడు కుటుంబాలు చిలకలూరిపేట సమీపంలో జామాయిల్‌ తోటల్లో పనికి వెళ్లారు. వారి అమాయకత్వాన్ని, అవసరాన్ని, పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని, వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. గర్భిణి, బాలింతలతోనూ బలవంతంగా పని చేయిస్తున్నట్లు యానాది సంఘాల మహా కూటమి, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఏడు కుటుంబాల్లోని మొత్తం 33 మందికి విముక్తి కల్పించి ఒంగోలు తీసుకొచ్చారు. కలెక్టర్‌ చేతుల మీదుగా రిలీఫ్‌ సర్టిఫికెట్లతో పాటు స్వీట్లు, దుస్తులు, ఇతర వంట సరుకులను అందించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడంతో పాటు జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. బాధితుల్లోని ఆసక్తి, అర్హతను బట్టి తగిన శిక్షణ కూడా ఇప్పించాలని నిర్దేశించారు. దయనీయ స్థితిలో ఉన్న తమకు స్వేచ్ఛ కల్పించిన కలెక్టర్‌ తమీమ్‌అన్సారియా కు బాధితులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్‌డీవో లక్ష్మీ ప్రసన్న, డీఎస్‌వో పద్మశ్రీ,, పౌరసరఫరాల సంస్థ డీఎం వరలక్ష్మి, తహసీల్దార్‌ మధు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్‌.సునీల్‌ కుమార్‌ (సార్డ్స్‌), శ్యామ్‌, పాషా, డేవిడ్‌ (ఐ.జె.ఎం.), ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement