
రిమ్స్ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్ కుమార్
ఒంగోలు టౌన్: రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం రాత్రి బాగా పొద్దుపోయే దాకా జరిగింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖకు చెందిన అధికారులు, రిమ్స్ హాస్పిటల్ కు చెందిన వివిధ విభాగాల హెచ్‌ఓడీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిరుపేద సామాన్య ప్రజలకు ఆరోగ్యాన్ని అందజేస్తున్న జీజీహెచ్ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ శుక్రవారం జీజీహెచ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. సమాచారం తెలిసిన వెంటనే మునిసిపల్, ఏపీఎస్‌ఐడీసీ, జీజీహెచ్, మెడికల్ కాలేజీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులతో కలిసి జీజీహెచ్ లోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫార్మశీ కోసం ఇంటిగ్రేటెడ్ స్టోరేజ్ స్పేస్ కావాలని అధికారులు చెప్పడం తెలిసిందే. ఈ క్రమంలో జీజీహెచ్ అధికారుల విజ్ఞప్తి మేరకు పాత క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోవిడ్ సమయంలో నిర్మించిన తాత్కాలిక వైద్యశాల క్యూబ్స్‌ను పరిశీలించి, వాటిని నర్సింగ్ విద్యార్థులకు ఉపయోగించుకునే అంశం మీద ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. డంపింగ్ యార్డు నిర్వహణ కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ విజయభాస్కర్‌ను ఆదేశించారు. పబ్లిక్ బాత్‌రూంలు, టాయిలెట్స్‌కు సంబంధించి ప్రతిపాదనలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టేలా కేపీసీ నిర్మాణ సంస్థకు ఆదేశాలు ఇవ్వాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈకి సూచించారు. ప్లే ఏరియా లెవెలింగ్ పనులకు సంబంధించి ఏర్పాటు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావును ఆదేశించారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ డా.భగవాన్ నాయక్, ప్రిన్సిపాల్ డా.ఏడుకొండలు, ఆర్‌ఎంఓ డా.తిరుమలరావు, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో కలెక్టర్ దినేష్‌కుమార్ తనిఖీ