మద్దలకట్టలో రోడ్డుపై ధర్నా చేస్తున్న గ్రామస్తులు
పెద్దారవీడు: రోడ్డు పక్కన ఉన్న బాలుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో మద్దలకట్ట గ్రామం బస్టాండ్ దగ్గర బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామంలో వినాయక విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ట్రాక్టర్‌పై వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. అనంతరం శ్రీశైలంలో నిమజ్జనానికి బయలుదేరేందుకు గుంటూరు – కర్నూల్ రహదారిపై వినాయక విగ్రహంతో వచ్చారు. అదే సమయంలో విజయవాడ డిపో ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి శ్రీశైలంకు వెళ్తుంది. ఊరేగింపులో పాల్గొన్న చిన్నారి గాలి సాయినితిన్‌రెడ్డి రోడ్డు పక్కన నిల్చోని ఉండగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు సాయినితిన్‌రెడ్డి(9)ని ఢీకొట్టి..కిందపడిన తర్వాత తలపై టైరు ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడు 4వ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో బంధువు రోడ్డుపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ధర్నా విరమించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యర్రగొండపాలెం ఎస్సై కోటయ్య, మార్కాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ నరసింహంలు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి కృష్ణవేణి, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సాయినితిన్‌రెడ్డి మృతదేహం
గాలి సాయినితిన్‌రెడ్డి (ఫైల్)


