త్రిపురాంతకం మండలం మేడపి వద్ద హైవేపై ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్
త్రిపురాంతకం: జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని ఒకరు మృతి చెందగా మరో 16 మంది గాయపడిన ఘటన బుధవారం ఉదయం త్రిపురాంతకం మండలంలో చోటుచేసుకుంది. కడప నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు త్రిపురాంతకం బైపాస్ ఫ్లైఓవర్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులో నుంచి మార్కాపురానికి చెందిన భీమిశెట్టి మానస, కడపకు చెందిన శివలక్ష్మి, మరో మహిళ అటుగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎక్కారు. కర్నూలు నుంచి మెప్మా ట్రైనింగ్ కోసం 22 మంది ఆ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో విజయవాడకు వెళ్తున్నారు. ట్రావెల్స్ బస్సు త్రిపురాంతకం మండలం మేడపి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని అదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో భీమిశెట్టి మానస(22) అక్కడికక్కడే మృతిచెందగా, అదే ట్రావెల్స్ బస్సు రెండో డ్రైవర్ రాజేష్ రెండు కాళ్లు విరిగాయి. ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న కర్నూలుకు చెందిన బీ శానవ్, స్రవంతి, వెంకటేశ్వరమ్మ, హేమలతారెడ్డి, రామలక్ష్మి, షెఫీ ఉన్నీస, జ్యోతి, శివగంగ, మరో ఏడుగురు గాయపడ్డారు.
వెంటాడిన మృత్యువు
మృతురాలు మానస స్వగ్రామం మార్కాపురం కాగా ఆమె గుంటూరులో ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కి అది కూడా ప్రమాదానికి గురై మానస మృత్యువాత పడటంతో మృత్యువు వెంటాడిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్‌ఐ సుమన్ తన సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను నాలుగు అంబులెన్స్‌ల్లో పల్నాడు జిల్లా వినుకొండ, గుంటూరుకు మెరుగైన వైద్య సేవల కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న దర్శి డీఎస్పీ అశోక్‌వర్థన్, ఆర్టీవో అమరనాథ్, ఎంవీఐ మాధవరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ట్రావెల్స్ బస్సు–లారీ ఢీకొని ఒకరు మృతి
మరో 16 మందికి గాయాలు
పల్నాడు జిల్లా వినుకొండలో చికిత్స పొందుతున్న మహిళలు
గాయపడిన వారిని అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలింపు
మృతురాలు మానస


