
భార్యాభర్తల మధ్య కలహాలు ఇద్దరి చిన్నారులను అనాథలుగా చేసింది.
ఒంగోలు టౌన్/ కొత్తపట్నం: క్షణికావేశం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. భార్యాభర్తల మధ్య కలహాలు ఇద్దరి చిన్నారులను అనాథలుగా చేసింది. తాలుకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒంగోలు నగరంలోని విరాట్ నగర్‌లో డాకా అంజిరెడ్డి (42), పూర్ణిమ (39) నివసిస్తుంటారు. అంజిరెడ్డి ఇంటివద్దే కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా, పూర్ణిమ ఆర్పీగా చేస్తోంది. వీరికి ఇద్దరు కూతుర్లు, భాఽర్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి ఎప్పటి లాగే వారి మధ్య వివాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరిగింది.
క్షణికావేశానికి గురైన అంజిరెడ్డి పక్కనే ఉన్న చపాతి కర్రతో భార్య తలమీద కొట్టాడు. తీవ్ర రక్త స్రావం అవుతుండటంతో భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. బంధువుల సహాయంతో ఆమెను వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా ఇంటి నుంచి వెళ్లిపోయిన అంజిరెడ్డి కొత్తపట్నం సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం కె.పల్లెపాలెం తీర ప్రాంతం వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో భార్యాభర్తల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటన విరాట్ నగర్‌లో విషాదాన్ని నింపింది. తలిదండ్రులు ఇద్దరూ మరణించడంతో కన్నీరుమున్నీరు అవుతున్న వారి కూతుళ్లను ఓదార్చడం కష్టంగా మారింది. మృతుడికి సోదరుడు వరసయ్యే పి.ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.