తోటలోనే పుచ్చకాయలు కొనుగోలు చేసి లారీకి ఎత్తుతున్న కూలీలు
హనుమంతునిపాడు: వేసవి పంటగా సాగుచేసిన పుచ్చ రైతులకు సిరులు కురిపిస్తోంది. జిల్లాలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పుచ్చ పంట విస్తారంగా సాగవుతోంది. ఈ ఏడాది మార్చి నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమ్మర్ సీజనల్ ఫ్రూట్‌గా పేరున్న పుచ్చకాయలకు అమాంతం డిమాండ్ పెరిగింది. వారం రోజుల నుంచి మంచి ధర కూడా పలుకుతోంది. జిల్లాలో సుమారు 1,200 ఎకరాల్లో పుచ్చ పంట సాగుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని మండలాల్లో వేసవి పంటగా సుమారు 200 ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా. హనుమంతునిపాడు మండలంలోని సీతారాంపురం పంచాయతీ పరిధిలో తురకపల్లి గ్రామంలోనే 70 ఎకరాల్లో పుచ్చ సాగు చేస్తున్నారు. ఇదే మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, తురకపల్లి, ఎలికవారిపల్లి, నరవగోపాలుపురం, లింగంగుంట గ్రామాల్లో వ్యవసాయ బోరు బావుల కింద పుచ్చ సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చవుతుండగా, 13 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తోంది. ఈ ఏడాది మంచి దిగుబడితో పాటు కాయ నాణ్యత కూడా బాగుంది. మంచి సైజు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. గత వారం వర్షానికి ముందు టన్ను పుచ్చ కాయ ధర రూ.12 వేల వరకు పలికింది. అయితే, అకాల వర్షానికి కాస్త ధర తగ్గడంతో ప్రస్తుతం టన్ను రూ.10 వేల నుంచి రూ.11 వేలు ఉంది. కాయ మంచి నాణ్యత, సైజు ఉంటే లాభాలు వస్తున్నాయని రైతులు అంటున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించడంలో పుచ్చకాయకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఎండలు మరింత పెరుగుతుండటంతో పుచ్చకాయకు డిమాండ్ పెరిగి మంచి ధర పలుకుతుందని, లాభాలు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు.
టన్ను రూ.12 వేలకు విక్రయించా : షేక్ కాశీం, పుచ్చ రైతు, తురకపల్లి, సీతారాంపురం
ఇటీవల కురిసిన వర్షానికి ముందు టన్ను పుచ్చకాయలను రూ.11 వేల నుంచి రూ.12 వేలకు విక్రయించాను. నేను వ్యవసాయ బోరు బావి కింద మూడు ఎకరాల్లో వేసవి పంటగా పుచ్చ సాగు చేశా. ఎకరాకి రూ.30 వేలు ఖర్చయింది. ఇప్పటికే ఎకరాకి 5 టన్నుల దిగుబడి వచ్చింది. ఇంకా ఒక కోతకు కాయ సిద్ధంగా ఉంది. మొత్తం 15 టన్నులు అమ్మాను. వర్షం రావడంతో ప్రస్తుతం ధర రూ.8 వేల నుంచి రూ.10 వేలలోపు వ్యాపారులు అడుగుతున్నారు. రూ.12 వేలకు అమ్మితే మంచి లాభాలు వస్తాయన్నారు. ఖర్చులన్నీపోను ఎకరాకి రూ.50 వేల వరకూ లాభం వచ్చింది.
జిల్లాలో సుమారు 1,200 ఎకరాల్లో పంట
ఆశాజనకంగా ఉందంటున్న రైతులు
వేసవి పంటగా పేరు


