
షర్మిల రోడ్‌షోకు పెద్ద ఎత్తున హాజరైన జనం
గోదావరిఖని: ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురువెళ్లి రాష్ట్రానికి అవసరమైన డిమాండ్లు సాధించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పిల్లిలా దాక్కుంటున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని వద్దకు వెళ్లి డిమాండ్లు సాధించుకునే దమ్ము లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ బతికి ఉంటే రామగుండం ఎరువుల కర్మాగారం ఎప్పుడో తెరుచుకునేదన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 18 వేల ఇళ్లస్థలాలను క్రమబద్ధీకరించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ఓపెన్‌కాస్ట్‌లు బొందల గడ్డలు అని మొసలికన్నీరుకార్చిన కేసీఆర్.. గోదావరిఖని సమీపంలోనే ఓసీపీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు 1.20 లక్షల మంది కార్మికులతో ఉన్న సింగరేణి నేడు 40 వేలకు చేరుకుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయన్నారు. సభలో వైఎస్సార్‌టీపీ నాయకులు అనిల్‌కుమార్, జిమ్మిబాబు,రాంరెడ్డి, రమేశ్, నగేశ్ పాల్గొన్నారు.