బూత్‌ల వారీగా స‌మ‌గ్ర వివ‌రాలు ఇవ్వండి: వైఎస్సార్‌సీపీ | YSRCP Writes Letter to AP Chief Electoral Officer | Sakshi
Sakshi News home page

బూత్‌ల వారీగా స‌మ‌గ్ర వివ‌రాలు ఇవ్వండి: వైఎస్సార్‌సీపీ

Sep 11 2026 6:53 PM | Updated on Sep 11 2026 7:02 PM

YSRCP Writes Letter to AP Chief Electoral Officer
  • పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియ పారదర్శకంగా జ‌ర‌గాలి
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి
  • రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి(సీఈఓ)కి లేఖ
  • అర్హులైన ఏ ఒక్కరి ఓటును తొల‌గించ‌కుండా చూడాలి
  • పోలింగ్‌ కేంద్రాల పునర్విభజనను మరోసారి సమీక్షించాలి
  • రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలి
  • దొంగ ఓట్ల‌ను ఏరివేయాలి చ‌ట్ట‌ప్ర‌కారం డూప్లికేట్ ఓట్లు తొల‌గించాలి
  • సీఈఓకి రాసిన లేఖ‌లో ప్ర‌స్తావించిన లేళ్ల అప్పిరెడ్డి 

తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి  లేఖ రాశారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగించ‌కుండా చూడాలని, అదే సమయంలో దొంగ ఓట్లను ఏరివేయాలని ఆ లేఖలో స్పష్టంగా కోరారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను బూత్‌ స్థాయిలో బహిర్గతం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేశాఆరు. ఈ లేఖ ప్రతిని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కూడా పంపించారు.

డౌన్ లోడ్ లింకుల‌తో స‌రిపెట్ట‌కుండా...
ఎస్‌ఐఆర్‌లో భాగంగా కొత్తగా ఓటర్లను చేర్చడం, తొలగించడం, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం, మరణించిన వారి ఓట్ల తొల‌గింపు, ఇతర సవరణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నియోజకవర్గాల వారీగా, బూత్‌ల వారీగా సమగ్రంగా అందించాలని లేఖలో కోరారు. కేవలం డౌన్‌లోడ్‌ లింకులు ఇవ్వకుండా అధికారికంగా సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మ్యాప్‌ కాని ఓటర్లు, ఇత‌ర కేటగిరీల కింద జారీ చేసిన నోటీసులపై కూడా పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరింది. 

ఎన్ని నోటీసులు జారీ చేశారు, ఎన్ని కేసులు పరిష్కరించారు, ఎన్ని ఓటర్లను తొలగించారు, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో బూత్‌, నియోజకవర్గాల వారీగా వెల్లడించాలని పేర్కొంది. దీనివల్ల బూత్‌ స్థాయి ఏజెంట్లు సంబంధిత ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనుమానిత ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిందని లేఖ‌లో అప్పిరెడ్డి పేర్కొన్నారు. వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, చట్ట ప్రకారం డూప్లికేట్ ఓట్ల‌ను తొలగించాలని కోరారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కుటుంబ స‌భ్యులంద‌రి ఓట్లూ ఒకే బూత్‌లో ఉండాలి
పోలింగ్‌ కేంద్రాల పునర్విభజనలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు బూత్‌లకు, కొన్ని సందర్భాల్లో వేర్వేరు వార్డులకు కేటాయించబడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకే ఇంటి చిరునామాలో నివసించే కుటుంబ సభ్యులను సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉంచాలని కోరారు. ఓటర్లను ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో పోలింగ్‌ కేంద్రానికి మార్చినప్పుడు అనుసరించిన ప్రమాణాలను కూడా స్పష్టంగా వెల్లడించాలని కోరింది. భౌగోళిక ప్రాంతం, ఇంటి నంబర్‌, ఓటరు వరుస సంఖ్య లేదా ఇతర ఏ ప్రమాణం ఆధారంగా ఓటర్లను బదిలీ చేశారో స్పష్టం చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నందున, ఎస్‌ఐఆర్‌ అనంతరం వచ్చిన తాజా ఓటర్ల డేటా ఆధారంగా పోలింగ్‌ కేంద్రాల పునర్విభజనను మరోసారి సమీక్షించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

బూత్‌ మ్యాపింగ్‌ను పార్టీలకు అందించాలి
కొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన పూర్తి బూత్‌ మ్యాపింగ్‌ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్‌కు అనుసంధానించిన ప్రాంతాలు, బూత్‌ స్థాయి అధికారుల వివరాలు, పాత బూత్‌ల నుంచి కొత్త బూత్‌లకు ఓటర్ల బదిలీల వివరాలను అందులో పొందుపరచాలని కోరారు. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్‌ కేంద్రాలకు నియమించిన బూత్‌ స్థాయి అధికారుల పేర్లు, సంప్రదించాల్సిన నంబ‌ర్ల‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ బూత్‌ స్థాయిలో పారదర్శకంగా జ‌ర‌గాలని, అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా చూడాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.

ఇదీ చదవండి:
‘అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement