పబ్లిక్‌ పరీక్షల బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు

YSRCP supports Public Examinations Bill - Sakshi

లోక్‌సభ

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వా­లు నిర్వహించే పబ్లిక్‌ పరీక్షల్లో అవతకవకలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు–2024కు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ.. పబ్లిక్‌ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పరీక్ష పత్రా­ల లీక్‌ కారణంగా నష్టపోయిన కోట్లాది మంది యువత ఈ తర­హా బిల్లు కోసమే ఎదురు చూస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష పత్రాలు లీక్‌చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఓబీసీల చేర్పు అభినందనీయమని ఎంపీ చింతా అనూరాధ పే­ర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ స్థానిక సంస్థల చట్టాల బిల్లుకు వైఎస్సార్‌సీపీ తరఫున మద్దతు ప్రక­టించారు. 

ఏకలవ్య పాఠశాలలు అత్యవసరం 
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏక­లవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠ­శాలల ఏర్పాటు అత్యవసరమని వైఎస్సార్‌సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. జమ్మూ కశ్మీర్‌ షెడ్యూల్డ్‌ కులాల, తెగల ఆర్డర్‌ సవరణ బిల్లులు–2024కు వైఎస్సార్‌సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. 

వేగివాడలో డీఎస్‌పీ 
పశ్చిమ గోదావరి జిల్లా వేగివాడలో ‘డిమాన్స్ట్రేషన్‌ కం సీడ్‌ ప్రొడక్షన్‌ ఫారం’ (డీఎస్‌పీ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు.

విశ్వవిద్యాలయాల్లో ఫ్రీ కోచింగ్‌ 
అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ (డీఏఎఫ్‌)’, అంబేడ్కర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (డీఏసీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఉచిత కోచింగ్‌ స్కీమ్‌ నిర్వహిస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మార్గాని భరత్‌ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.  

ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు 
రైతులు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను అవలంభించేందుకు ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకేల)ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా తెలిపారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిస్తూ.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుం­టూరు, కృష్ణా, కర్నూలు, ప్ర­కాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి చొప్పున కేవీకేలు ఉన్నట్టు వివరించారు. మిల్లెట్, ఎర్రపప్పు, బెంగాల్‌ చిట్రా, కదిరి, వేరుశనగ వంటి పంటల ఉత్పత్తి కోసం కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మొబైల్‌ సందేశాలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top