
వైయస్‌ఆర్సీపీని దెబ్బతీసి ఉద్దేశంతో లేని లిక్కర్ కేసును బనాయించారని ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ నేపథ్యంలో ఢిల్లీలో సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు.
సాక్షి, ఢిల్లీ: ఏపీలో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతోందని, లేని లిక్కర్ కేసును బనాయించి వైయస్‌ఆర్సీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ నేపథ్యంలో సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు.
ఏపీలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల ఉన్నప్పటికీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణం. మద్యం విధానం పై చర్చకు మేము సిద్ధం. అలాగే.. 2014-2024 వరకు మద్యం విధానంపై కూడా చర్చించాలి. టీడీపీ హయాంలో ప్రైవేటు వ్యాపారులకు మద్యం లైసెన్స్ ఇచ్చి ఊరురా బెల్టు షాపులు పెట్టించారు. టీడీపీ హయాంలో పెద్ద సంఖ్యలో బెల్టు షాపులతో మద్యం ఏరులై పారింది. కానీ..
మా ప్రభుత్వ హాయంలో పారదర్శకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహించి అమ్మకాలను తగ్గించింది. వైయస్సార్సీపీని దెబ్బతీసి ఉద్దేశంతో లేని లిక్కర్ కేసును బనాయించారు అని అన్నారాయన. ఏపీలో వైఎస్ జగన్‌కు తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలోని ఖనిజ సంపదను అప్పుల కోసం తాకట్టు పెడుతున్నారు. ఈ అంశాలన్నీ పార్లమెంటులో లేవనెత్తుతా అని తెలిపారు.
ఇక.. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్‌కు కేంద్రం గట్టి బుద్ధి చెప్పిందన్న వైవీ సుబ్బారెడ్డి.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
