ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనకు ముందు విమాన సిబ్బంది పింకీ మాలి తన తండ్రి శివకుమార్ మాలికి చేసిన చివరి ఫోన్ కాల్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన పింకీ..ప్రయాణానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ, ‘పప్పా, నేను అజిత్ పవార్‌తో బారామతి వెళ్తున్నాను. ఆయనను అక్కడ దింపిన తర్వాత నేను నాందేడ్‌కి వెళ్తాను. మనం రేపు మాట్లాడుకుందాం’ అని చెప్పింది. ఆ మాటలు ఆమె తండ్రికి చివరి జ్ఞాపకంగా మిగిలిపోయాయి.
పింకీ మాలీ మరణంపై ఆమె తండ్రి శివకుమార్ మాలి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా కూతురు ఫోన్ చేస్తే మాట్లాడాను. చివరిగా.. ‘రేపు నీ పని అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని అన్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాలేదు. తన కూతురు ఇక లేరని తెలుసుకున్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.
ఆయన మాట్లాడుతూ..‘నేను ఆమెతో రేపు మాట్లాడతానని అనుకున్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. నా కూతురు నాకు దూరమైపోయింది. ఆమె ఇటీవల అజిత్ పవార్‌తో అనేక ప్రయాణాల్లో పాల్గొనేది. నాకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. నాకు టెక్నికల్ విషయాలపై అవగాహన లేదు. నేను పూర్తిగా కుంగిపోయాను. నాకు కావలసింది ఒక్కటే. నా కూతురి భౌతిక కాయం. గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయడానికి మాత్రమే నేను కోరుకుంటున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మాటలు ఒక తండ్రి హృదయవేదనను, ఒక కుటుంబం ఎదుర్కొంటున్న విషాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పింకీ మాలి చివరి మాటలు ఇప్పుడు వారి కుటుంబానికి శాశ్వత జ్ఞాపకంగా మిగిలిపోయాయి.


