
సాక్షి, విశాఖపట్నం: పులివెందుల్లో వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని కూటమి సర్కార్ పట్టపగలే ఖూనీ చేసిందన్నారు. నల్లగొండువారిపల్లెలో ప్రభుత్వ అండతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. చివరికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై కూడా దాడికి దిగడం దారుణమని బొత్స అన్నారు.
ఒక శాసనమండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా..?. వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రాముతో పాటు పలువురిపైన దాడులు చేశారు. వాహనాలను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి నిప్పంటిస్తామంటూ అరాచకం సృష్టించారు. టీడీపీ గూండాల దాడులకు పోలీసులు మద్దతిస్తున్నారా?. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.?’’ అంటూ బొత్స నిలదీశారు.
‘‘సీఎం చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహించాలి. పులివెందుల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

వైఎస్సార్ జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో మేము ముందుగా చెప్పినట్లే టీడీపీ అరాచకాలు ప్రారంభమయ్యాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వరుసగా బైండోవర్ కేసులు, కౌన్సిలింగ్ అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను స్టేషన్లకు పిలిపిస్తున్నారు. మా వాళ్ళపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. పులివెందులలో హింస చెలరేగిపోతోంది’’ అంటూ రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం వైఎస్ జగన్‌ను ఓడించాం అని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. నిన్న మా వాళ్లు పెళ్లికి వెళ్తే దాడులకు దిగారు. హత్యాయత్నం చేశారు. అందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజలని ఓటింగ్‌కి రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 16 మందిపై హత్యాయత్నం కేసు పెట్టామన్నారు. వాళ్లను అరెస్ట్ చేశారా..?. దేనికోసం వారు ఈ దాడులకు దిగుతున్నారు అనేది బయటకు చెప్పాలి. వెంటనే వారిని రిమాండ్‌కి పంపండి. ఇవాల మరొక నాయకుడు వేల్పుల రాముపై దాడికి దిగారు..
..ప్రజాస్వామ్యంలో ఇది సక్రమమైన పద్ధతేనా..? ప్రజలు దీన్ని హర్షిస్తారా..?.. పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి..?. రానున్న రోజుల్లో హత్యలు కూడా చేయడానికి వెనుకాడరు. ఈ హింసను ప్రజలు, పులివెందుల ఓటర్లు గమనించాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.