‘కూటమి’ కుట్రలు.. గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | Ysrcp Leaders Meet Governor At Raj Bhavan | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన.. గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Published Thu, Mar 13 2025 5:18 PM | Last Updated on Thu, Mar 13 2025 7:11 PM

Ysrcp Leaders Meet Governor At Raj Bhavan

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు తెలుగుదేశం వారికే చేయాలి.. వైఎస్సార్‌సీపీ వారికి ఏ పనీ చేయకూడదు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో పాలనను అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి విరుద్దంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామిక స్పూర్తికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.  ప్రభుత్వంలో సంక్షేమాన్ని అందుకునే లబ్దిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపచేస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరి పట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబులా మాట్లాడలేదన్నారు.

రాష్ట్రంలోని ఏ రాజకీయపార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకుంటారని అన్నారు. ఏ పార్టీ అయినా వ్యక్తిగత ఏజెండాతో పనిచేయవని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ పార్టీ రంగు పులమడం దారుణమన్నారు.

ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, చివరికి జర్నలిస్ట్‌లపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, విడదల రజనీ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వున్నారు.

గవర్నర్ ను కలవనున్న బొత్స సత్యనారాయణసహా పలువురు నేతలు

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement