‘డీఎస్సీ అక్ర‌మాల‌ను డైవ‌ర్టు చేయ‌డానికే ప‌వ‌న్ పాట్లు’ | Ysrcp Leader Vangaveeti Narendra Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీ అక్ర‌మాల‌ను డైవ‌ర్టు చేయ‌డానికే ప‌వ‌న్ పాట్లు’

Jun 4 2026 11:20 PM | Updated on Jun 4 2026 11:20 PM

Ysrcp Leader Vangaveeti Narendra Fires On Pawan Kalyan

సాక్షి, తాడేప‌ల్లి: రెండేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల‌ను వంచించిందే కాకుండా వాటిపై ప్ర‌శ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయ‌కుల మీద త‌ప్పుడు కేసులు పెట్టి వేధించడం, స‌మాధానం చెప్ప‌లేక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని వైఎస్సార్సీపీ అధికార ప్ర‌తినిధి వంగ‌వీటి న‌రేంద్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల పాల‌న పూర్త‌యినా సూప‌ర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమ‌లు చేసిన పాపాన‌పోలేదని.. బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్ గ్యారెంటీ బాండ్ల‌కు చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ఏం స‌మాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్ర‌బాబు మొద‌టి సంత‌కం చేసిన మెగా డీఎస్సీ వెనుక జ‌రిగిన కుంభ‌కోణంతో ప్రభుత్వం ఇరుకున ప‌డిందని, దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకు తెలంగాణ‌లో విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి పాల‌న చేత‌కాక‌నే తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నాడ‌ని, చేత‌నైతే విభ‌జ‌న హామీల అమ‌లుకు ప్రయ‌త్నించాలని వంగ‌వీటి న‌రేంద్ర హిత‌వు ప‌లికారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్
మోస‌పు హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌తో అన్ని వ‌ర్గాల‌కు వెన్నుపోటు పొడిచింది. వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు కొత్త‌గా సూప‌ర్ సిక్స్ ఇస్తామ‌ని చెప్పి చివ‌రికి ఏదీ కాకుండా చేశారు. చంద్రబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు బాండ్ పేప‌ర్ల మీద సంత‌కాలు చేసి మ‌రీ సూప‌ర్ సిక్స్ హామీల విష‌యంలో మాట‌త‌ప్పారు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌జ‌ల త‌ర‌ఫున వైయ‌స్సార్సీపీ ప్ర‌శ్నిస్తుంటే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నారు. రెండేళ్లుగా కూట‌మి ప్ర‌భుత్వ అరాచ‌కాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

అక్ర‌మ కేసులతో వేధింపులు, దాడుల‌తో బెదిరించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌తో అడ్డంగా దొరికిన ప్ర‌తిసారీ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి త‌ల్లి, చెల్లి, గొడ్డ‌లి అంటూ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారు. జ‌రగ‌ని కుంభ‌కోణాల‌ను జ‌రిగిన‌ట్టుగా క‌ట్టుక‌థ‌లు అల్ల‌డంతోపాటు అక్ర‌మ కేసుల‌తో వైఎస్‌ జ‌గ‌న్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్న నాయ‌కుల‌ను జైళ్ల‌కు పంప‌డమే ప‌నిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క దానికీ ఆధారాలు లేక‌పోయినా పోలీసుల‌ను అడ్డం పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు బదులు తీర్చుకోవ‌గానికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు.

కూట‌మి పాల‌న‌లో గాడిత‌ప్పిన శాంతిభ‌ద్ర‌త‌లు
వైఎస్సార్సీపీ అధికారంలో ఉండ‌గా రాజ‌కీయ ల‌బ్ధి కోసం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు నోటికొచ్చిన‌ట్టు త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. రాష్ట్రం అప్పుల‌పాలై శ్రీలంకగా మారిపోయింద‌ని ఊద‌ర‌గొట్టారు. 30 వేల మంది అమ్మాయిలు అదృశ్య‌మైపోయార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధారాలు లేకుండా మాట్లాడాడు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌యినా వారు చేసిన ఆరోప‌ణ‌ల్లో దేనినీ నిరూపించ‌లేక‌పోయింది.

మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్ప‌స్తామ‌ని చెప్పిన కూట‌మి నాయ‌కులు, రెండేళ్లుగా మహిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను అరిక‌ట్ట‌లేక‌పోయారు. కేంద్ర సంస్థ‌ల నివేదిక ప్ర‌కారం రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో రాష్ట్రం అట్ట‌డుగున ఉంద‌ని, మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న నేరాల్లో ఏపీ మొద‌టిస్థానంలో ఉంద‌ని, నేరాలు గ‌త ప్ర‌భుత్వం కంటే మూడు రెట్లు పెరిగాయ‌ని రుజువైంది. వైయ‌స్సార్సీపీ హయాంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించిన దిశ యాప్‌కి శ‌క్తి యాప్ అని పేరు మార్చి నిర్వీర్యం చేసేశారు. కూట‌మి ఎమ్మెల్యేలే కామాంధులుగా మారి వేధిస్తున్నార‌ని ఆధారాల‌తో స‌హా మ‌హిళ‌లు ఫిర్యాదు చేసినా వారిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోగా, బాధితుల‌నే వేధిస్తున్న ప‌రిస్థితులు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. 

డిప్యూటీ సీఎంగా ఏం చేశాడో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పాలి
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పే మాట‌ల‌కు, చేసే ప‌నుల‌కు పొంత‌న ఉండ‌టం లేదు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసగించ‌డ‌మే కాకుండా ప‌క్క‌నే ఉన్న తెలంగాణ‌కి వెళ్లి తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభేధాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కేంద్రంలో భాగస్వామ్య  పార్టీగా ఉన్న జ‌న‌సేన అధ్య‌క్షుడిగా విభ‌జ‌న హామీలు ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నించ‌కుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ‌గొట్టి ప‌బ్బం గ‌డుపుకోవాలి చూడ‌టం సిగ్గుచేటు.

కూట‌మి పాల‌న‌కు రెండేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా బాబు ష్యూరిటీ- భ‌విష్య‌త్ గ్యారెంటీ పేరుతో సంత‌కాలు పెట్టి రిలీజ్ చేసిన బాండ్ల‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు స‌మాధానం చెప్పాలి. ఏపీలో పాల‌న గాలికొదిలేసి తెలంగాణ‌లో రాజ‌కీయాలు చేయ‌డం సిగ్గుచేటు. ఏపీలో మెగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఆధారాల‌తో స‌హా రుజువు కావడంతో దానికి స‌మాధానం చెప్పే ధైర్యం లేక ప‌క్క రాష్ట్రం వెళ్లి విద్వేష ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాడు.

దీంతో పాటు అమ‌రావ‌తిలో అవినీతి నిరంతర ప్ర‌క్రియ‌గా మారిపోయింది. శాండ్‌, ల్యాండ్, మైన్‌, వైన్ దోపిడీని ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అక్ర‌మాల‌ను వైఎస్సార్సీపీ ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు తీసుకొస్తుంటే ఏ ఒక్క‌దానికి ప్ర‌భుత్వం జ‌వాబు చెప్ప‌డం లేదు. చంద్ర‌బాబు స్క్రిప్టు ప్ర‌కారం నడుచుకుంటూ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కూడా ప్ర‌జ‌లు రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారని వంగ‌వీటి న‌రేంద్ర స్ప‌ష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement