ముస్లింల‌కు చంద్ర‌బాబు వెన్నుపోటు: ఖాద‌ర్ బాషా | YSRCP Leader Sheikh Khadar Basha Fires On Chandrababu Naidu Over Supporting Waqf Bill 2025, More Details Inside | Sakshi
Sakshi News home page

ముస్లింల‌కు చంద్ర‌బాబు వెన్నుపోటు: ఖాద‌ర్ బాషా

Apr 5 2025 2:55 PM | Updated on Apr 5 2025 5:16 PM

Ysrcp Leader Sheikh Khadar Basha Fires On Chandrababu

సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతున్నారని వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు, వ‌క్ఫ్ బోర్డు మాజీ చైర్మ‌న్‌ షేక్ ఖాద‌ర్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్దమైన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి సహకారాన్ని అందించిన చంద్రబాబు ముస్లింల పట్ల తన వ్యతిరేక వైఖరిని చాటుకున్నారని మండిపడ్డారు. వక్ఫ్ భూములను కాజేసే కుట్రలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయ్యిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...

ఉమ్మ‌డి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా  చేశాన‌ని గొప్పులు చెప్పుకునే చంద్ర‌బాబు ముస్లింలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేక‌పోవ‌డం ఘోరం. ముస్లిం స‌మాజం మొత్తం ముక్త కంఠంతో వ్య‌తిరేకిస్తున్న వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా చంద్ర‌బాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఒక‌ప‌క్క బీజేపీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుకు ఏక‌ప‌క్షంగా మ‌ద్ద‌తు తెలిపిన చంద్ర‌బాబు, స‌వ‌ర‌ణ‌లు సూచించామ‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ముస్లిం స‌మాజంలో వ‌క్ఫ్ భూమి అంటే అల్లాకు చెందిన భూమి అని అర్థం. గ‌డిచిన వందేళ్లుగా ఎంతోమంది దాత‌లు ముస్లింల స‌మాజ ఉద్ధ‌ర‌ణ కోసం మంచి మ‌న‌సుతో సేవాభావంతో దానమిచ్చిన భూమి అది. ఇది ప్ర‌భుత్వ భూమి కాదు. ఈ భూమితో ప్ర‌భుత్వానికి సంబంధం లేదు.

వైఎస్సార్సీపీపై బుర‌ద‌చల్లాల‌ని..
వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల‌లో తీవ్ర‌మైన ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం కావ‌డంతో వైఎస్సార్‌సీపీ మీద బుర‌ద‌జ‌ల్లాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా టీడీపీ త‌ప్పుడు ప్ర‌చారం మొద‌లుపెట్టింది. లోక్‌స‌భ‌లో ఈ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్య‌తిరేకించిందని ఒక‌రోజు, రాజ్య‌స‌భ‌లో మ‌ద్ద‌తు తెలిపార‌ని ఇంకోరోజు ఆధారాలు లేకుండా త‌ప్పుడు ప్ర‌చారానికి దిగింది. ఈ విధంగా ఇక్క‌డ కూడా చంద్ర‌బాబు త‌న రెండు నాలుక‌ల ధోర‌ణి ప్ర‌ద‌ర్శించారు.

వక్ఫ్ బిల్లుతో చంద్రబాబు ముస్లింలకు వెన్నుపోటు పొడిచారు : ఖాదర్ బాషా

వ‌క్ఫ్ బిల్లును వ్య‌తిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీలు మాట్లాడారు. లోక్‌స‌భ‌లో ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేయ‌గా, రాజ్య‌స‌భ‌లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విప్ కూడా జారీ చేశారు. బిల్లుకి వ్య‌తిరేకంగా ఓటేశారు. కానీ కొన్ని ఊరూపేరు లేని ప‌త్రిక‌ల్లో ప‌త్రిక‌ల్లో జ‌గ‌న్ ముస్లింల‌కు వెన్నుపోటు అంటూ టీడీపీ పెయిడ్ క‌థ‌నాలు రాయించి ముస్లింల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేసింది. రాజ్య‌స‌భ‌లో వ‌క్ఫ్ బిల్లుకు మ‌ద్దుతుగా వైయ‌స్సార్సీపీ ఓటేసింద‌ని రుజువు చేయాల‌ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స‌వాల్ విసిరితే ఇంత‌వ‌ర‌కు టీడీపీ నుంచి స‌మాధానం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement