‘కుట్రతోనే లిక్కర్‌ స్కామ్‌ అంటూ అక్రమ కేసు’ | YSRCP Leader Botsa on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘కుట్రతోనే లిక్కర్‌ స్కామ్‌ అంటూ అక్రమ కేసు’

May 16 2025 5:44 PM | Updated on May 16 2025 6:59 PM

YSRCP Leader Botsa on Chandrababu Govt
  • వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం
  • రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు 
  • ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు
  • ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము
  • ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం
  • :మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్‌

కాకినాడ:    తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ,వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పని చేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే, నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండ గడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.

బొత్స  ఇంకా ఏం మాట్లాడారంటే..

కూటమి ప్రభుత్వం దారుణ వ్యవహారం
కూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్‌ ముగిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. కూటమి పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు.

ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి కింది ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. కానీ, ఏడాది గడుస్తున్నా వాటిలో ఏదీ అమలు చేయడం లేదు.

మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగింత. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. ‘సీజ్‌ ది షిప్‌’ అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు.

తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారు?
ఏడాది పాలనలోనే ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు. ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు? మా హయాంలో అప్పులు చేసినా, వివిధ పథకాల కింద రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మరి కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి. సంపద సృష్టిస్తాను. అది తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు, మరి ఇన్ని అప్పులు, ఇంత తక్కువ సమయంలో ఎందుకు చేశారు? అప్పు చేయడం. ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు.

అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొంత అప్పు చేసినా, ఆ ఖర్చులకు ఒక అర్థం ఉంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, తీర ప్రాంతాల్లో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, బోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ఇలా ఉత్పాదకతకు దోహదం చేసే వాటికి ఖర్చు చేశాం. మాట ఇస్తే, దాన్ని తప్పకుండా నెరవేర్చాలనేది జగన్‌గారి విధానం. అందుకే ఎన్నికల ముందు, టీడీపీ కూటమి మాదిరిగా, అడ్డగోలు హామీలు ఇవ్వలేదు.

పార్టీ కార్యాచరణ. నిర్ణయాలు
వైఎస్సార్‌సీపీ అయిదు జిల్లాల ముఖ్య నేతలతో ఈరోజు (శుక్రవారం) సమావేశం నిర్వహించాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రతి జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నాం. అలాగే గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో పాటు, తీర ప్రాంతాల్లోని ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పొగాకు రైతులు ఇదే సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు.

దీనిపై పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్, పొగాకు రైతులను కలిసి నేరుగా వారితో మాట్లాడనున్నారు. తదుపరి పొగాకు కొనుగోళ్ళపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ పరంగా కార్యాచరణను ఖరారు చేయడం జరుగుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పొగాకు మద్దతు ధర లభించని సందర్భంగా మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ మొద్దునిద్ర నుంచి ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు రైతుల పక్షాన పోరాడతామని  బొత్య సత్యనారాయణ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement