
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. తన ప్రచార వాహనం దగ్ధం కేసులో కుట్రలు చేసి నిందితుడిని కోవర్టుగా మారుస్తున్నారని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మార్గాని భరత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఈ కేసులో నిందితుడిని మా వద్దకు పంపి కోవర్టు ఆపరేషన్ చేశారు. నిందితుడు వైఎస్సార్‌సీపీ అని పోలీసులు ఎలా ఆపాదిస్తారు?. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. నిందితుడి బంధువులంతా టీడీపీకి చెందినవారే. ఈ ఘటనపై మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రమాణానికి సిద్దమా?.
ప్రచార వాహనం దగ్ధంపై సమగ్ర విచారణ జరగాలి. సదరు వ్యక్తి మూడు గంటలు అక్కడే మద్యం తాగాడా?. ఎలా ఒక్కడే పెట్రోల్ తీసుకొచ్చి వాహనానికి నిప్పంటిస్తాడు. అతడికి మాపై అభిమానం ఉంటే మా ఆస్తిని ఎందుకు ధ్వంసం చేస్తారు. మోరంపూడి శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులు పూర్తిగా పరువు కోల్పోయారు. అందుకే నాపై ఈ ఘటనతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రిలో ఇప్పటివరకు ఇంతటి దుర్మార్గమైన పనులు ఎక్కడ జరగలేదు.
