
విశాఖ : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ పథకం ప్రస్తావన తీసుకురాకపోవడంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయడానికి ముహూర్తం ఏమిటని ప్రశ్నించారు. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చెయ్యాలని వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బొత్స తెలిపారు.
ఈరోజు( సోమవారం) విశాఖ నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన బొత్స.. ‘ తల్లికి వందనం ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు p4కి సంబంధం ఏమిటి?, p4 కి పథకాలకు లింక్ పెట్టడం ఏమిటి..? , లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ పథకం అమలు చేయనట్టేనా.. ఆడ బిడ్డ నిధి పథకంపై కూటమి నేతలు స్పందించాలి. ఇస్తారో ఇవ్వరో కూటమి ప్రభుత్వం చెప్పాలి.
రాష్ట్రంలో మహిళలు అందరూ ఆలోచించాలి. ప్రభుత్వ డొంక తిరుగుడు వ్యవహారాన్ని గమనించాలి. ఆడ బిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. లేదంటే మహిళలను మోసం చేసిన వారు అవుతారు. విశాఖ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. 6 నెలలుగా జీవీఎంసీ కమిషనర్ లేరు.కీలకమైన జీవీఎంసీ కమిషనర్ స్థానాన్ని భర్తీ చేయకపోవడం దురదృష్టం. కూటమి ప్రభుత్వానికి అధికారం, దోచుకోవడం మాత్రమే అవసరం. కూటమి పార్టీల మధ్య సంఖ్యత లేదు.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవు. పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని అబాసూపాలు చేస్తుంది. ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం చేతిలో పెట్టుకుని చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు నష్టపోతారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తరువాత మోసం చెయ్యడం బాబుకి అలవాటే’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.