నిమ్మగడ్డకు ఆ అధికారం ఎక్కడిది?

YSR Congress Party MPs Comments with media in New Delhi - Sakshi

నిధులు రాకుండా టీడీపీ ఎంపీలు అడ్డుపడుతున్నారు

న్యూఢిల్లీలో మీడియాతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు 

సాక్షి, న్యూఢిల్లీ: పచ్చచొక్కాలతో కాక్‌టైల్‌ డిన్నర్‌ చేసి అడ్డంగా దొరికిపోయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉండడానికి అర్హులా కాదా అన్న విషయాన్ని ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు హితవు పలికారు. ఏకగ్రీవ ఎన్నికలు వద్దనే అధికారం ఆయనకు ఎక్కడిదని వారు ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి గందరగోళపర్చడం, అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం ఆయనకు అలవాటైందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, చింతా అనూరాధ, అయోధ్య రామిరెడ్డిలు శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును నమ్మిన వారెవరూ బాగుపడిన చరిత్రలేదని, నిమ్మగడ్డ త్వరలోనే ఆ విషయం తెలుసుకుంటారని వారన్నారు. పంచాయతీ ఎన్నికల కోసం ఎస్‌ఈసీ తయారుచేయించిన ఈ–యాప్‌ ఎక్కడ తయారైందో చెప్పడానికి నాలుగు రోజుల సమయం అడిగారంటే అది ఎక్కడ రూపొందిందో అర్ధంచేసుకోవచ్చన్నారు.

మోదీని తిట్టి అమిత్‌షాను ఎలా కలిశారు?
ప్రధాని మోదీ నిజాలు మాట్లాడరని గతంలో విమర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అమిత్‌షాను కలిశారో చెప్పాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. పోలవరం, ప్యాకేజీ కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని.. కానీ, ఢిల్లీ వచ్చినప్పుడల్లా సీఎం జగన్‌ కోరేది ప్రత్యేక హోదానేఅని వారు తెలిపారు. కాగా, రాష్ట్రానికి నిధులు రాబట్టాలని తాము కృషిచేస్తుంటే టీడీపీ ఎంపీలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అలాగే, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో సీఎం జగన్‌కు సహకరించాలని ప్రజలు కోరుకుంటుంటే గొడవలు సృష్టించాలని టీడీపీ చూస్తోందని వారు ఆరోపించారు.  

లోకేష్‌ పిచ్చి ట్వీట్లు మానుకోవాలి : బాలశౌరి
కాగా, లోకేష్‌ పిచ్చిపిచ్చి ట్వీట్లు చేయడం మానుకోవాలని ఎంపీ బాలశౌరి అన్నారు. విశాఖ ఉక్కుకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదని.. ఇలాంటి సమయంలో దానిపై ఊహాగానాలు సరికావని, తమ అధినేత సీఎం జగన్‌తో మాట్లాడి వైఖరి చెబుతామన్న మాటలను వక్రీకరించారని ఆయన ఆరోపించారు. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను చదివి నవ్వులపాలు కావద్దని లోకేష్‌కు బాలశౌరి హితవు పలికారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top