
ప్రభుత్వం చెప్పేదానికి కాగ్ నివేదికలు పూర్తి విరుద్ధం
చంద్రబాబు కూటమి ప్రభుత్వ విధానాలను కడిగి పారేసిన వైఎస్ జగన్
2025 ఏప్రిల్‌లో జీఎస్టీ ఆదాయం అత్యధికంగా రూ.3,354 కోట్లని మే 1న ప్రభుత్వం ప్రకటన
అదే సమయంలో జీఎస్టీ ఆదాయం 24.20 శాతం తగ్గిందన్న కాగ్
దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుట్ర పూరితంగా వ్యవహరించిన సర్కార్
మేలో రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం పెరుగుతుందంటూ మరో పత్రికా ప్రకటన
ఐజీఎస్టీ సర్దుబాట్ల కారణంగా జీఎస్టీ ఆదాయం రూ.796 కోట్లు తగ్గిందని వెల్లడి.. సర్దుబాట్లన్నీ లెక్కించాక తేలేదే నికర జీఎస్టీ ఆదాయం
గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏప్రిల్‌లో పన్ను ఆదాయం 12.21 శాతం తగ్గుదల
పన్నేతర ఆదాయాలు సైతం 22.01 శాతం తగ్గుముఖం
12.76 శాతం తగ్గిన రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలే అందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు, కాగ్ నివేదికల్లో వాస్తవాలను ఉటంకిస్తూ శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కూటమి సర్కార్ చెబుతున్న అబద్ధాలను కడిగి పారేశారు. ఇంకా ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
⇒కాగ్ 2025 ఏప్రిల్‌కు సంబంధించి కీలక సూచికలను వెల్లడించింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నది స్పష్టమవుతోంది. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 ఏప్రిల్‌లో నికర జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా మే 1న ప్రభుత్వం పత్రిక ప్రకటన విడుదల చేసింది.
⇒ కానీ.. కాగ్ నివేదికలో వాస్తవ లెక్కలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క అబద్ధమని తేల్చింది. 2024 ఏప్రిల్‌తో పోల్చితే, 2025 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది. కాగ్ వాస్తవాలను బట్టబయలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్‌కు సంబంధించిన జీఎస్టీ ఆదాయాలు చెప్పకుండా, మేలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం మరో పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

⇒ కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్‌కు సంబంధించి ఐజీఎస్టీ ముందస్తు సర్దుబాట్ల కారణంగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయాలు రూ.796 కోట్లు తగ్గాయని ఆ పత్రికా ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఐజీఎస్టీ ముందస్తు సర్దుబాట్లను మైనర్ హెడ్ 110 కింద లెక్కిస్తారు. ప్రభుత్వ ఖాతాల మేజర్ హెడ్ 0006 కింద ఎస్‌జీఎస్టీని లెక్కిస్తారు. ఇది ఒక సాధారణ ప్రక్రియ. ఈ సర్దుబాట్లన్నింటినీ లెక్కించిన తర్వాతే నికర జీఎస్టీ ఆదాయాలను లెక్కకడతారు.

⇒ 2025 ఏప్రిల్‌కు సంబంధించి నికర జీఎస్టీ ఆదాయం రూ.3,354 కోట్లుగా ఉన్నట్లు మే 1న పత్రికా ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం.. ఇపుడు సర్దుబాట్లు కారణంగా రూ.796 కోట్ల ఆదాయం తగ్గిందని చెబుతోంది. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే.. దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దగమనంలో ఉంది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 12.76 శాతం తగ్గింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం.