సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ యత్నాలను మరోసారి ఎండగట్టారు మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్‌సీపీ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, చంద్రబాబు ప్రభుత్వ దాష్టీకాలను తీవ్రంగా విమర్శించిన జగన్, తమ హయాంలో జరిగిన భూ రీసర్వేను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు నిస్సిగ్గుగా చేస్తున్న ప్రయత్నాలు ప్రజలముందుంచారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
‘‘ఈ భూమండలంపై క్రెడిట్ చోరీ అత్యంత సమర్థంగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈయన్ను చూసి సిగ్గుపడాల్సిందే. అంత దారుణమైన మోసాలు చేస్తున్నారు.’’ అని జగన్ విమర్శించారు. ఏడాదిన్నరగా అధికారంలో ఉన్నప్పటికీ రైతు సమస్యలు తీర్చాలన్న ఆలోచన ఆయనకు అస్సలు లేకుండా పోయిందని, 2019-2024 మధ్యకాలంలో తాము చేపట్టిన భూ రీసర్వేను కూడా తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
‘‘నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. అప్పట్లో రాష్ట్రంలో సర్వేయర్లు లేరు, భూముల సర్వేకు తగిన టెక్నాలజీ కూడా లేదు’’ అని జగన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తానని తాను 2019నాటి మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీకి కట్టుబడి 2020 డిసెంబరు 21న దాన్ని ప్రారంభించామని వివరించారు. రైతులకు మేలు చేసే ఏ ఆలోచన కూడా చంద్రబాబుకు అస్సలు రాదని.. వచ్చిందల్లా భూములను నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. ‘‘నాలుగుసార్లు సీఎంగా ఉండి.. ఎనిమిది పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? చంద్రబాబూ ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? చేశావా?’’ అని ప్రశ్నించారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర భూ సర్వే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహా యజ్ఞం. వివాదాల్లేకుండా, అత్యంత పారదర్శకంగా భూముల రీ సర్వే జరగింది. ఎవరూ మార్చలేని విధంగా భూ రికార్డులు సిద్ధం చేశాం. భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చాం. అందుకు ప్రభుత్వం పూచీకత్తుగా నిలిచింది. రైతుల పాస్‌బుక్కుల్లోనూ క్యూఆర్ కోడ్ వంటి అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచాం.’’ అని జగన్ తెలిపారు.
విప్లవాత్మకమైన చర్యలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం కోసం తాను చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను జగన్ సవివరంగా వివరించారు. గ్రామాల్లో సచివాలయ నిర్మాణాలు మొదలుకొని, వాటిల్లో ఒక్కోదాంట్లో పది మంది సిబ్బంది నియామకాలను కూడా ఆయన గుర్తు చేశారు. సమగ్ర భూ సర్వే విజయవంతం అయ్యేందుకు రికార్డు స్థాయిలో 40 వేల మంది సిబ్బందిని పురమాయించామని చెప్పారు. సిబ్బంది మొత్తానికి ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇప్పించేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా చేసుకున్నామని, హెలికాప్టర్లు, డ్రోన్లతో సర్వే నిర్వహించామని జగన్ వివరించారు. ‘
‘మా హయాంలోనే మొదటిసారి డ్రోన్లతో సర్వే జరిగింది. కోట్ల సర్వే రాళ్లను ఉచితంగా రైతులకు అందించాం. వాటిపై భూసర్వే-భూరక్ష అని రాయించాం’’ అని తెలిపారు. సర్వేలో ఎక్కడా రాజీ పడలేదని, భూమి కొలతల్లో ఐదు సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కచ్చితమైన సర్వే చేశామన్నారు. ఇందుకోసం రూ.ఆరు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడలేదని... ఈ కృషిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్ గ్రేడ్ ఇచ్చిందని, రూ.400 కోట్ల రాయితీ కూడా వచ్చిందని తెలిపారు. 2023 డిసెంబర్‌లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినాసరే.. చంద్రబాబు తన పాత అలవాటు ప్రకారం ‘‘అంతా నేను చేశాను’’ అంటున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో జరిగిన భూముల రీసర్వేను ఎన్నో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనియాడాయని జగన్ తెలిపారు. కేరళ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర అధికారులు కూడా అధ్యయనం జరిపారని, సర్వే ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఈ సర్వేను ఎంతగానో మెచ్చుకున్నారని చెప్పారు.



చంద్రబాబు రాక్షసపాత్ర...
భూముల రీసర్వే విషయంలో చంద్రబాబు పాత్ర రాక్షసుడికి ఏమాత్రం తగ్గదని, ఎల్లోమీడియా అసిస్టెంట్ రాక్షస పాత్ర పోషించిందని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా భూ సర్వేపై రైతులను భయపెట్టారని, ఇప్పుడు కూడా దుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు.
అయితే నిజాలను ఎంతో కాలం దాచిపెట్టగలరని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు సర్వే రాళ్లు కూడా లేకుండా సర్వే అంటున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు పాస్‌బుక్కుల విషయంలో మమల్ని అనుసరిస్తున్నాడు. కాకపోతే రంగు మార్చాడంతే. మార్చేందుకు వీల్లేని పాస్‌బుక్కులు ఇచ్చేందుకు మేము ప్రయత్నించాం. ఇప్పుడు విపరీతమైన తప్పులు ఉంటున్నాయి. మేము పాతిన సర్వే రాళ్లను తొలగించేందుకు ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది ఈ వ్యవహారం. మేము ఒక బృహత్తర లక్ష్యంతో మొదలుపెట్టిన భూముల సర్వేను చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు నీరుగారుస్తోంది’’ అని వివరించారు.


