ఎస్‌ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
అనిల్ చంద్ర పునేఠను కలిసిన తర్వాత మీడియాతో వైఎస్ జగన్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా?
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసే హక్కు ఉంది
నామినేషన్ల దగ్గర నుంచి ఓట్ల లెక్కింపు వరకు లైవ్ వెబ్ కాస్టింగ్ కల్పించాలి
చంద్రబాబు ప్రభుత్వంపై మాకు నమ్మకంలేదు.. బ్యాలెట్ బాక్స్‌లు ఉంచే స్ట్రాంగ్ రూమ్‌లను లైవ్‌లో చూపించాలి.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీదే
రెండున్నరేళ్లుగా మాఫియాగా ఉన్న అధికారులతోనే ఎన్నికలు జరిపిస్తున్నారు
డీఐజీ కోయ ప్రవీణ్ వృత్తి ధర్మం మరిచిపోయి వెన్నుపోటు పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నాడు
గతంలో చంద్రబాబుకు కరుడుగట్టిన తీవ్రవాదిలా మద్దతుదారుడైన
నిమ్మగడ్డ ప్రసాద్ ఎస్‌ఈసీగా ఉన్నప్పుడే మేము ఎన్నికలు నిర్వహించాం
అప్పుడు ఎస్పీలను, డీఎస్పీలను ఎడాపెడా బదిలీలు, సస్పెండ్ చేశారు
ఇప్పుడు అలాంటి చర్య ఒక్కటైనా ఉందా? తక్షణమే కేంద్ర పారా మిలటరీ బలగాలు దించాలి
మా సూచనలన్నింటికీ ఎస్‌ఈసీ తలూపారు.. అవి అమలు చేస్తే నిష్పాక్షికంగా వ్యవహరించినట్లు..
లేదంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ పరిణామాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు
నామినేషన్ వేసే అవకాశం కల్పించడం ఎస్‌ఈసీ కనీస బాధ్యత. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే పోలింగ్ దగ్గర నుంచి 17సీ ఫారం తీసుకునే వరకు మొత్తం లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచాలి. చంద్రబాబు ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. ఎన్నికల తర్వాత బ్యాలెట్ బాక్సులను మార్చేసే అవకాశం ఉంది. అందుకే బ్యాలెట్ బాక్స్‌లను ఉంచే స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ కల్పించాలి. – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు, నామినేషన్ వేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.. దీన్ని కాపాడాల్సిన ధర్మం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై (ఎస్‌ఈసీ) ఉంది. నామినేషన్లు వేస్తానని వచ్చిన వాళ్ల చేత నామినేషన్లు వేయించలేకపోతే పోయేది ఎస్‌ఈసీ పరువే. పోలీసులు రక్షణ ఇచ్చి అందరి చేత నామినేషన్లు వేయించేలా చర్యలు తీసుకోవాలి.’ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చంద్రబాబుకు ప్రైవేటు వాచ్‌మెన్‌లా పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల నామినేషన్లలో జరుగుతున్న అరాచకాలపై ఆదివారం మధ్యాహ్నం ఆయన విజయవాడలో ఎస్‌ఈసీ కార్యాలయంలో ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠను కలిసి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకుంటున్న దౌర్జన్యాలు, టీడీపీ శ్రేణుల హింసాకాండ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై అక్రమ కేసులు, అరెస్టులు, నామినేషన్ పత్రాలను చించివేసిన ఘటనలు.. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం, పులివెందులలో పోలీసుల బాష్పవాయువు ప్రయోగం, గాలిలోకి కాల్పుల ఘటనలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్‌ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.
డీజీపీ, ఐజీ, డీఐజీ ఇలా అందరూ ఒక మాఫియాలా ఏర్పడి ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం రెండేళ్లకు ఒకసారి కీలక అధికారులను బదిలీ చేయాల్సి ఉన్నా, అలా చేయకుండానే రెండున్నరేళ్లుగా మాఫియాలా ఉన్న అధికారులతోనే ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఎత్తి చూపారు. చివరకు డీఐజీ కోయ ప్రవీణ్ వంటి వాళ్లు వెన్నుపోటు పార్టీ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే పోలింగ్ దగ్గర నుంచి 17సీ ఫారం తీసుకునే వరకు మొత్తం లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, ఎన్నికల తర్వాత బ్యాలెట్ బాక్సులను మార్చేసే అవకాశం ఉందని.. అందుకే బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి లైవ్ వెబ్‌కాస్టింగ్ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రజాస్వామ్య వ్యవస్థలను ఫణంగా పెట్టొద్దు
‘ఇవాళ ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠను కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేశాం. ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఉంది. ఈ వ్యవస్థను ఏ ఒక్కరి స్వార్థం కోసం కూడా ఫణంగా పెట్టకూడదన్న అంశాన్ని కమిషనర్‌కు స్పష్టంగా నొక్కి చెప్పాం. మాకు అందిన సమాచారం మేరకు దాడులకు సంబంధించిన తాజా పరిస్థితులతో కూడిన జాబితాను ఆయనకు అందజేశాం. ఈ రాష్ట్రంలో ఇవాళ ‘నేను నామినేషన్ వేయాలనుకున్నాను.. కానీ నన్ను వేయనివ్వలేదు’ అన్న మాట వస్తే, పోయేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరువే అని గట్టిగా చెప్పాం. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ.. సమయం పొడిగించి అయినా సరే పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరితో నామినేషన్ వేయిస్తామని హామీ ఇచ్చారు.
టీడీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు
గురజాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో స్వయంగా పోలీసులే మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థులపై దొంగ కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేసి పోటీకి దూరం చేస్తున్నారు. అక్రమంగా నిర్బంధించిన ఆ అభ్యర్థులను పోలీసులు వెంటనే తీసుకొచ్చి వారితో నామినేషన్లు వేయించాలని గట్టిగా డిమాండ్ చేశాం. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ఇంత దారుణంగా సాగుతుంటే, పోలీసులు మాత్రం నిస్సిగ్గుగా వెన్నుపోటు పార్టీకి, చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారు. నిబంధనల ప్రకారం నలుగురు మాత్రమే వెళ్లాలని మా వైఎస్సార్‌సీపీ వాళ్లను ఆపుతున్నారు.
తీరా నామినేషన్ కేంద్రాల వద్ద చూస్తే అప్పటికే టీడీపీ వాళ్లు వందల సంఖ్యలో గుమిగూడి మారణాయుధాలతో తిష్ట వేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే మా అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ టీడీపీకి వత్తాసు పలుకుతున్నందున ఎన్నికల విధులకు వెంటనే కేంద్ర ప్రభుత్వ బలగాలను, పారా మిలటరీ ఫోర్సెస్‌ను దించాలని డిమాండ్ చేశాం.
అన్ని చోట్లా సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి
పోలింగ్ బూత్‌ల లోపల, బయట సీసీ టీవీ లైవ్ ఫుటేజ్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలి. మాకు చంద్రబాబునాయుడు, వెన్నుపోటు పార్టీ నైజంపై ఏ మాత్రం నమ్మకం లేదు. వాళ్లు స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను మారుస్తారన్న అనుమానం మాకుంది. అందుకే స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులు ఉంచే ప్రదేశాల్లో కూడా సీసీ టీవీ కెమెరాల లైవ్ ఫుటేజ్‌ను ప్రజలందరికీ అందుబాటులో పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. కౌంటింగ్ హాల్‌లో కూడా సీసీ కెమెరాలు పెట్టి లైవ్ టెలి కాస్ట్ ఇవ్వాలి.
కౌంటింగ్ హాల్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత ఏజెంట్లు సంతకాలు చేసి స్టిక్కర్లు అతికించే ’ఫామ్ 17సి’ వెరిఫికేషన్ ప్రక్రియ అత్యంత కీలకం. ఆ సంతకాలు సరిపోల్చే ప్రక్రియలో ఎలాంటి పోర్జరీలకు తావు లేకుండా సీసీ టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ చేసి చూపించాలి. ఈ డిమాండ్లపై గతంలోనే మా ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చారు. ఇవాళ నేను కూడా స్వయంగా వచ్చి వీటిని అమలు చేయాలని గట్టిగా చెప్పాను. మేము అడిగిన వాటని్నంటికీ కమిషనర్ తల ఊపారు. ఎస్‌ఈసీ నిజంగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే ఇవన్నీ అమలవుతాయి.
కమిషన్ పారదర్శకంగా లేకపోతే ఇవేవీ జరగవు. దీన్నిబట్టే వీళ్లు నిష్పక్షపాతంగా ఉన్నారా లేదా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛ, నాయకులకు పోటీ చేసేందుకు నామినేషన్ వేసే హక్కు రాజ్యాంగబద్ధమైనవి. ఈ ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన ధర్మం ఎస్‌ఈసీపైనే ఉంది.
నాడు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపాం
మా ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎవరున్నారు? చంద్రబాబుకు కరడు గట్టిన తీవ్రవాదిలా మద్దతుదారుడైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించండి అంటూ స్వయంగా బలపం కట్టుకుని తిరిగిన వ్యక్తి ఆయన. అంతటి వ్యతిరేక వ్యక్తి కమిషనర్‌గా ఉన్నప్పటికీ మా హయాంలో ధైర్యంగా ఎన్నికలకు వెళ్లాం. నోటిఫికేషన్ రాగానే నిమ్మగడ్డ రమేష్.. కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు, డీఎస్పీలు, సీఐలను లెఫ్ట్, రైట్, సెంటర్ బదిలీలు చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఈరోజు అలాంటి చర్య ఒక్కటైనా జరుగుతోందా? మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చి విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామ సచివాలయాలు, వలంటీర్లు, మహిళా సాధికారత, పారదర్శక పాలన అందించాం కాబట్టే ప్రజలు మాకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు.

టీడీపీ శ్రేణుల హింసాకాండపై ఎస్‌ఈసీ అనిల్ చంద్రపునేఠకు ఫిర్యాదు చేస్తున్న వైఎస్ జగన్
నిజాయితీగా ఎన్నికలు జరిపే ధైర్యం లేకే కుయుక్తులు
నేడు చంద్రబాబు ప్రభుత్వంలో సూపర్ సిక్స్‌లు లేవు, సూపర్ సెవెన్‌లు లేవు.. అన్నీ మోసాలుగా తేలిపోయాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లను చేతబట్టుకుని ప్రజలు ‘మాకు మూడేళ్లుగా బాకీ పడ్డ సొమ్ము ఎప్పుడు ఇస్తారు?’ అని టీడీపీ నేతలను నిలదీస్తున్నారు. లా అండ్ ఆర్డర్, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ కుదేలైపోయాయి. అందుకే బాబుకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిపే ధైర్యం లేక ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సీఆరీ్పఎఫ్ సెక్యూరిటీ ఉంది. అక్కడ ఏం జరిగిందో కేంద్ర ప్రభుత్వానికి సాక్ష్యాలతో సహా వాళ్లే ప్రత్యక్ష సాక్షులుగా రిపోర్టులు ఇస్తారు.
మిథున్‌రెడ్డి కేవలం నలుగురితో కలిసి నామినేషన్ కేంద్రానికి వెళ్తే, అప్పటికే వేలాదిగా మోహరించిన టీడీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. మిథున్‌రెడ్డిని మూడు గంటల పాటు నిర్బంధించి, నామినేషన్ పత్రాలను తీసుకోకుండా అడ్డుకుని, కార్లను ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. బోల్తా పడిన కార్లలో మద్యం బాటిళ్లు మాత్రం నిటారుగా నిలబడి ఉన్నాయి! కారు బోల్తా పడితే మద్యం బాటిళ్లు పడకుండా నిటారుగా ఎలా ఉంటాయి? మద్యం అలవాటు లేని మిథున్‌రెడ్డి కారులో పోలీసులే దగ్గరుండి బాటిళ్లు పెట్టి, తప్పుడు ఆధారాలు సృష్టించారు. డీఐజీ పరిధిలోనే ఈ దారుణాలన్నీ జరిగాయి.
నామినేషన్లు వేసే వరకు సమయం పొడిగించాల్సిందే
ఈ పరిస్థితుల్లో మధ్యాహ్నం 3:30 దాటినా, రాత్రి 8 గంటల వరకైనా సరే సమయం పొడిగించి అర్హులైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరితో నామినేషన్లు వేయించాలని కోరగా కమిషనర్ అంగీకరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కును, పోటీ చేసే స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత కమిషన్‌పైనే ఉంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అంతకు ముందు వైఎస్ జగన్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను 20 నిమిషాల పాటు ఎస్‌ఈసీకి వివరించారు.
ప్రతి నామినేషన్ కేంద్రం, పోలింగ్ కేంద్రంలో నిరంతర సీసీటీవీ రికార్డింగ్ తో పాటు ప్రత్యక్ష వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని.. స్ట్రాంగ్ రూమ్‌ల ప్రవేశ ద్వారాలు, పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచి, బ్యాలెట్ పెట్టెల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల్లోనూ సీసీ టీవీ పర్యవేక్షణ, రికార్డుల భద్రత ఏర్పాట్లు ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ అయోధ్యరావిురెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, అప్పిరెడ్డి, రుహుల్లా, కల్పలతారెడ్డి, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అవినాష్, రాయన భాగ్యలక్ష్మి, సుధాకర్‌బాబు, నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు ప్రైవేట్ వాచ్‌మెన్లుగా మారిన పోలీసులు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసు యంత్రాంగం చంద్రబాబునాయుడుకు ప్రైవేట్ వాచ్‌మెన్లుగా తయారైంది. ఒక ఐజీ, ఆయన కింద డీఎస్పీలు, సీఐలు ఒక సిండికేట్ మాఫియాగా ఏర్పడ్డారు. సాధారణంగా ఏ అధికారైనా ఒకే చోట రెండేళ్లకు మించి ఉండకూడదన్న నిబంధన ఉన్నా, రెండున్నరేళ్లుగా వాళ్లనే పాత స్థానాల్లో కొనసాగిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఎన్నికలను నడిపించేందుకే ఈ వ్యవస్థీకృత మాఫియాను కంటిన్యూ చేస్తున్నారు.
ఈ పోలీసు మాఫియా స్థానిక ఎమ్మెల్యేలతో కుమ్మక్కై ఇసుక రీచ్‌ల నుంచి లిక్కర్ వ్యాపారం దాకా అందినకాడికి దోచుకుంటూ ‘చిన్నబాబుకు ఇంత.. పెద్దబాబుకు ఇంత’ అని వాటాలు పంచుకుంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది. ఇలాంటి వారి చేతుల మీదుగా ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ అచ్చం టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఐపీఎస్ అనే వృత్తి ధర్మాన్ని, యూనిఫాం టోపీపై ఉన్న మూడు సింహాల గౌరవాన్ని సైతం గాలికొదిలేసి టీడీపీ తొత్తులా ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.


